Andhra Pradesh: ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు.. అయినా నెట్టుకుంటూ వస్తున్నాం, గోదావరి జిల్లాల పర్యటనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
‘‘వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి.. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారు
Vjy, Sep 11: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎకరాకు రూ.10 వేలు పరిహారం చెల్లించనున్నట్లు సీఎం ప్రకటించారు.
గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘‘వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి.. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలే ఎక్కువ నష్టపోతారు. మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు వద్ద 5 రోజులు ఉండి గండ్లు పూడ్చారు కాబట్టే విజయవాడకు వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు వదిలింది వైకాపాకు చెందిన వారే. పడవలు వదిలిపెట్టి తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. అక్కడికి వచ్చినవి అక్రమ ఇసుక వ్యాపారం చేసిన పడవలేనని మండిపడ్డారు.
నేరాలు చేసే వ్యక్తులు.. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైసీపీ మొత్తం దోచేసి అప్పులు మిగిల్చింది. వాటిని భర్తీ చేస్తున్నాం. ఖాళీ ఖజానాతో అభివృద్ధి ఆగిపోయింది. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు.. అయినా నెట్టుకుంటూ వస్తున్నాం. కృష్ణా నదికి ఊహించని విధంగా వరద వచ్చింది. గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలమైంది. దీంతో బుడమేరుకు గండ్లు పడ్డాయి. తెదేపా హయాంలో మంజూరు చేసిన నిధులనూ పక్కన పెట్టారు. ఎక్కడా ఒక డ్రెయిన్, కాలువ తవ్విన పాపాన పోలేదన్నారు.
. పనిచేసే వ్యక్తులు పనిచేయడం మానేశారు. విజయవాడలో సాధారణ పరిస్థితులు రావడానికి 10 రోజులు పట్టింది. బుడమేరు గండ్లు పూడ్చటానికి ఒక యుద్ధమే చేశాం. ఆర్మీ వాళ్లే మావల్ల కాదని చేతులెత్తేశారు. మా మంత్రులు దగ్గరుండి గండ్లు పూడ్పించారు. ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయి? అప్పుడు బాబాయిని చంపి నెపం నెట్టారు.. ఇప్పుడు బోట్లతో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నారు. నేరాలు చేసే వారు ప్రజా జీవితంలో ఉంటే ఇలానే ఉంటుంది. నేరస్థులు రాజకీయ ముసుగు వేసుకున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు.