AUS vs SA Stat Highlights: గెలుపుతో T20 ప్రపంచ కప్‌ని ప్రారంభించిన ఆసీస్, ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన హాజెల్‌వుడ్‌

గ్రూప్‌-1 మ్యాచ్‌లో (AUS vs SA Stat Highlights) కంగారూలు ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి శుభారంభం అందుకున్నారు.

Australia Cricket (Photo Credits: Twitter/@Cricketcomau)

T20 ప్రపంచ కప్‌ ప్రారంభంలో హేమా హేమీల మ్యాచ్‌ చప్పగా సాగింది. గ్రూప్‌-1 మ్యాచ్‌లో (AUS vs SA Stat Highlights) కంగారూలు ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి శుభారంభం అందుకున్నారు. మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులే చేసింది.

మార్‌క్రమ్‌ (36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 40) పరుగులు, రబాడ (19 నాటౌట్‌), మిల్లర్‌ (16) పరుగులు చేశారు. హాజెల్‌వుడ్‌ (2/19), జంపా (2/21), స్టార్క్‌ (2/32) తలా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 121 రన్స్‌ చేసి గెలిచింది. స్మిత్‌ (34 బంతుల్లో 3 ఫోర్లతో 35), స్టొయినిస్‌ (24 నాటౌట్‌), మ్యాక్స్‌వెల్‌ (18) రాణించారు. నోకియా 2 వికెట్లు పడగొట్టారు. హాజెల్‌వుడ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌ చేపట్టగా.. ఆసీస్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. మొదటి ఓవర్లో బవూమ రెండు చూడముచ్చటైన ఫోర్లతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ఆశావహంగానే ప్రారంభమైంది. అయితే రెండో ఓవర్లోనే బవుమాను మ్యాక్సీ బౌల్డ్‌చేయగా.. డుసెన్‌ (2), డికాక్‌ (7)లను హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 23/3తో ఇక్కట్లలో పడింది. ఆదుకుంటాడనుకున్న క్లాసెన్‌ (13)ను కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. మిల్లర్‌, ప్రిటోరియస్‌ (1)ను 14వ ఓవర్లో అవుట్‌ చేసిన జంపా ప్రత్యర్థికి డబుల్‌ షాకిచ్చాడు. కేశవ్‌(0) రనౌట్‌ కాగా మార్‌క్రమ్‌, నోకియా (2) త్వరత్వరగా పెవిలియన్‌ చేరడంతో దక్షిణాఫ్రికా మాదిరి స్కోరుకే పరిమితమైంది.

టీ20 ప్రపంచకప్‌ను ఓటమితో ఆరంభించిన కోహ్లీ‌సేన, వికెట్ పడకుండానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకున్న పాక్, ప్రపంచకప్‌ చరిత్రలో దాయాది దేశానికి భారత్‌పై 10 వికెట్ల తేడాతో తొలి విజయం

లక్ష్య ఛేదనలో 20 రన్స్‌కే ఓపెనర్లు ఫించ్‌, వార్నర్‌ను ఆసీస్‌ కోల్పోయింది. నోకియా బంతిని డ్రైవ్‌ చేయబోయి రెండో ఓవర్లోనే కెప్టెన్‌ ఫించ్‌ (0) డకౌట్‌ అయ్యాడు. ఇక ఐపీఎల్‌ రెండో దశలో చెత్త ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ జట్టునుంచి ఉద్వాసనకు గురైన వార్నర్‌..రబాడ ఓవర్లో 2 ఫోర్లు కొట్టి టచ్‌లోకొచ్చినట్టే కనిపించాడు. రబాడ వేసిన మరో ఓవర్లో ఇంకో బౌండరీ సాధించి జోరు చూపించిన వార్నర్‌ (14)ను అదే ఓవర్లో అతడు క్యాచ్‌అవుట్‌ చేశాడు.

ఆపై మిచెల్‌ మార్ష్‌ (11) కూడా పెవిలియన్‌ చేరడంతో 8 ఓవర్లలో 38/3తో ఆసీస్‌ ఇబ్బందుల్లో పడింది. దాంతో స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ భారీషాట్ల జోలికి పోకుండా నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. అయితే మార్‌క్రమ్‌ పట్టిన సంచలన క్యాచ్‌తో స్మిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తర్వాత చైనామన్‌ బౌలర్‌ షంసీ.. మ్యాక్స్‌వెల్‌ను బౌల్డ్‌ చేసి ఆసీ్‌సకు షాకిచ్చాడు. 81/5తో ఉన్న తరుణంలో రబాడ బౌలింగ్‌లో 2 ఫోర్లు దంచిన వేడ్‌ (15 నాటౌట్‌) ఒత్తిడి తగ్గించాడు. 18 బంతుల్లో 25 పరుగులుగా సమీకరణం మారగా..19 ఓవర్లో ఓ ఫోర్‌ కొట్టిన స్టొయినిస్‌ ఆఖరి ఓవర్లో మరో 2 బౌండరీలు సంధించి ఆసీస్‌ను విజయ తీరాలకు (South Africa Batters Struggle As Australia Win) చేర్చాడు.

స్కోరుబోర్డు : దక్షిణాఫ్రికా:

బవూమ (బి) మ్యాక్స్‌వెల్‌ 12, డికాక్‌ (బి) హాజెల్‌వుడ్‌ 7, డుసెన్‌ (సి) వేడ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 2, మార్‌క్రమ్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) స్టార్క్‌ 40, క్లాసెన్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 13, మిల్లర్‌ (ఎల్బీ) జంపా 16, ప్రిటోరియస్‌ (సి) వేడ్‌ (బి) జంపా 1, కేశవ్‌ మహరాజ్‌ రనౌట్‌ (మ్యాక్స్‌వెల్‌/వేడ్‌) 0, రబాడ (నాటౌట్‌) 19, నోకియా (సి) ఫించ్‌ (బి) స్టార్క్‌ 2, షంసీ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 118/9. వికెట్లపతనం: 1/13, 2/16, 3/23, 4/46, 5/80, 6/82, 7/83, 8/98, 9/115. బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-32-2, మ్యాక్స్‌వెల్‌ 4-0-24-1, హాజెల్‌వుడ్‌ 4-1-19-2, కమిన్స్‌ 4-0-17-1, జంపా 4-0-21-2

ఆస్ట్రేలియా:

వార్నర్‌ (సి) క్లాసెన్‌ (బి) రబాడ 14, ఫించ్‌ (సి) రబాడ (బి) నోకియా 0, మార్ష్‌ (సి) డుసెన్‌ (బి) మహరాజ్‌ 11, స్మిత్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) నోకియా 35, మ్యాక్స్‌వెల్‌ (బి) షంసీ 18, స్టొయినిస్‌ (నాటౌట్‌) 24, వేడ్‌ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 19.4 ఓవర్లలో 121/5. వికెట్లపతనం: 1/4, 2/20, 3/38, 4/80, 5/81. బౌలింగ్‌: రబాడ 4-0-28-1, నోకియా 4-0-21-2, కేశవ్‌ మహరాజ్‌ 4-0-23-1, షంసీ 4-0-22-1, ప్రిటోరియస్‌ 3.4-0-26-0.