Ayodhya Ram Mandir: గుడ్ న్యూస్..నవంబర్ 18న రామ మందిర్ నిర్మాణం, రామజన్మభూమిపై సుప్రీంకోర్టులో 17న విచారణ పూర్తి, సంచలన వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే, యూపీ సీఎం వ్యాఖ్యలకు బలం
ఈ వివాదానికి సుప్రీంకోర్టు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌చంద్ పరాఖ్ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ayodhya,October 7: అయోధ్యలోని రామజన్మభూమి మీద దశాబ్దాలుగా వివాదం నడుస్తున్న సంగతి అందరికీ విదితమే. ఈ వివాదానికి సుప్రీంకోర్టు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌చంద్ పరాఖ్ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలిలో నిర్వహించిన రామ్‌లీలా కార్యక్రమానికి జ్ఞాన్‌చంద్ ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన.. అయోధ్య వివాదంలో అక్టోబర్ 17నాటికి సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడిస్తుంది. ఆ వెంటనే మందిర నిర్మాణం పనులు ప్రారంభమవుతాయి. నవంబర్ 17నాటికి రామజన్మభూమిలో మందిర నిర్మాణం పూర్తవుతుంది. దాంతో ఈ ఏడాది చాలా అద్భుతంగా ముగుస్తుంది’ అన్నారు. జ్ఞాన్‌చంద్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా ఏళ్లుగా నడుస్తున్న అయోధ్య స్థల వివాదం విచారణను ఈ నెల 17నాటి కల్లా ముగించేయనున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై విచారణను ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగా అక్టోబర్ 17తో ముగించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై శుక్రవారం 37వ రోజు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయం వెల్లడించింది. ఈనెల 14తో ముస్లిం పక్షాల వాదనలను ముగిస్తామని, ఆ తదుపరి రెండు రోజులు హిందూ పక్షాలు ప్రతి వాదనలు (రిజాయిండర్స్) వినిపించేందుకు అవకాశం కల్పిస్తామని ధర్మాసనం తెలిపింది. 17న రెండు పక్షాలు తుది వాదనలు వినిపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంతకుముందు ఈ నెల 18నే ఈ కేసుపై విచారణను ముగిస్తామని ధర్మాసనం తెలిపింది. నవంబర్ 17న సీజేఐ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆలోగా తుదితీర్పు వెల్లడించనుంది.
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్య వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ జన్మభూమి వివాదంలో త్వరలోనే శుభవార్త వినబోతామని పేర్కొన్నారు. అయితే యోగి వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడ్డాయి. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్ కోర్టు పరిధిలో ఉన్న అంశం మీద ఎలాంటి తీర్పు రాబోతుందో యోగికి ముందే ఎలా తెలిసింది అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు బిజెపి ఎమ్మెల్యే గైన్ చంద్ పరఖ్ చేసిన వ్యాఖ్యలతో ఇది ఏ తీరానికి చేరుతుందో చూడాలి.