EAPCET 2023 Update: ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ, 2023-24కు వెయిటేజీని పునరుద్ధరించిన అధికారులు
దీనికి కారణం ఏంటంటే.. 2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు.
ఏపీలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నారు. దీనికి కారణం ఏంటంటే.. 2020-21, 2021-22లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. దీంతో రెండేళ్లు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాసినందున 2023-24కు ఈ వెయిటేజీని పునరుద్ధరించారు.
గతేడాది ప్రథమ సంవత్సరంలో 70శాతం సిలబస్‌నే విద్యార్థులు చదివినందున ఈఏపీసెట్‌లోనూ ఆ మేరకే ప్రశ్నలు ఇవ్వాలని నిర్ణయించారు.ఇక ఇంటర్మీడియట్‌లోని నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షల్లో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఈ పరీక్షలను బుధవారం, శుక్రవారం నిర్వహిస్తున్నామని, గతంలో అనుత్తీర్ణులైన వారు, పరీక్ష రాయని విద్యార్థులు కళాశాలల నుంచి పాత హాల్ టికెట్లను తీసుకోవాలని సూచించారు. ఈ పరీక్షల్లో పాస్ కానివారికి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ఇవ్వబోమని వెల్లడించారు.