AP SSC Exams 2020: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు! విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు వెల్లడి
కాగా, ఇప్పటికే తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే....
Amaravathi, June 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం అధికారికంగా ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు టెన్త్ విద్యార్థులందర్నీ పాస్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
పదో తరగతి విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్ మరియు సెకండియర్ విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫీజులను రిఫండ్ చేయనున్నట్లు తెలిపారు.
'తప్పనిసరిగా పరీక్షలు చేపట్టాలని అనుకున్నాం, పరీక్ష విధానంలో మార్పులు చేసాం, 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నాం. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచాం, అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నాం. అయితే, కరోనావైరస్ ప్రబలుతున్న సమయంలో ఏ తల్లి తన బిడ్డ ఆరోగ్యం గురించి బెంగపెట్టుకోకూడదని సీఎం జగన్ అభిప్రాయపడిన నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేసేందుకే నిర్ణయం తీసుకున్నాం' అని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు.
ఏపి ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. కాగా, ఇప్పటికే తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.