JEE Main 2021 April Session Postponed: జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలు వాయిదా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర విద్యాశాఖ, తదుపరి తేదీలపై 15 రోజులు ముందుగా విద్యార్థలకు సమాచారం
జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలు వాయిదా (JEE Main 2021 April Session Postponed) వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
New Delhi, April 18: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలు వాయిదా (JEE Main 2021 April Session Postponed) వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు (JEE Main 2021 April Session) కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీలను 15 రోజుల ముందుగా విద్యార్థులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు.
ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పరీక్షకు సంబంధించి రెండు సెషన్లు పూర్తయ్యాయి. ఇక మూడో సెషన్ కరోనా వల్ల వాయిదా పడింది. కరోనా దృష్ట్యా రెండురోజుల క్రితం సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను సైతం రద్దు చేశారు. 12 తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి విదితమే. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించవద్దని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించడం వల్ల తాము వైరస్ బారిన పడే ప్రమాదముందని పేర్కొంటున్నారు.
అయితే ముందుగా కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు, నీట్ పీజీ పరీక్ష జరుగుతుందని స్పష్టంచేసింది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు, పలు పార్టీల నాయకులు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రధాని నరేంద్రమోదీ అధికారులతో సమావేశమైన అనంతరం సీబీఎస్‌ఈ పరీక్షలపై విద్యాశాఖ నిర్ణయాన్ని వెల్లడించింది. పది పరీక్షలను రద్దు చేయగా.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేశారు.