TS PolyCET 2021 Counselling Date: తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు విడుదల, టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎస్బీటీఈటీ, ఆగస్టు 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభం
రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ప్రకటించింది.
Hyderabad, July 27: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు (Telangana Polytechnic Results) రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) టీఎస్ పాలిసెట్ -2021 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను (TS PolyCET 2021 Counselling Date) విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది.
ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ నిర్వహిస్తారు. అదే నెల 6 నుంచి 10 వరకు పాలిసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. దీంతో పాటు 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23న తుది విడత పాలిసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఆగస్టు 24న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన.. 24, 25 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.
ఆగస్టు 27న రెండో విడత పాలిటెక్నిక్ సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్ 1న నుంచి పాలిటెక్నిక్ విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. సెప్టెంబరు 9న స్పాట్ ప్రవేశాలకుగాను మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.