Telangana SSC Exam Timetable 2021: తెలంగాణలో మే 17 నుంచి 26 వరకు 10వ తరగతి పరీక్షలు, ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు, వెల్లడించిన టీఎస్ ఎస్‌ఎస్‌సీ బోర్డు
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు (Telangana SSC Exam timetable 2021) నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది.
పరీక్షల షెడ్యూల్ వివరాలు : మే 17న తెలుగు, మే 18న హిందీ, మే 19న ఇంగ్లీష్, మే 20న మ్యాథ్స్, మే 21న సైన్స్, మే 22న సోషల్ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు పేర్కొంది.
ఇక ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ఐపిఇ) 2021 మే 1 నుండి ప్రారంభం అవుతున్నాయి. మే 1న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ద్వితీయ భాషా పేపర్ -1 తో ప్రారంభమవుతుండగా, ఆ మరుసటి రోజు మే 2న సెకండ్ ఇయర్ పరీక్షలు ద్వితీయ భాషా పేపర్ II తో ప్రారంభం అవుతున్నాయి.
దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు. కాగా, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 7 నుంచి 20 వరకు జరుగుతాయని మంత్రి వెల్లడించారు.
అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 1న మరియు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్ 3న జరగనున్నాయి. వొకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలతో సహా తత్సమాన విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి తిరిగి తెరుచుకోనున్న విషయం తెలిసిందే.