TS Inter Exams 2022: తెలంగాణలో ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు ఇంటర్ పరీక్షలు, టైం టేబుల్‌ను విడుదల చేసిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్
ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు పరీక్షలు (TS Inter Exams 2022) జరుగనున్నాయి. 20న ఫస్టియర్‌కు, 21న సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ప్రధాన పరీక్షలు మే ఐదో తేదీతో ముగియనుండగా, మైనర్ సబ్జెక్టులకు మే 10 వరకు కొనసాగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు పరీక్షలు (TS Inter Exams 2022) జరుగనున్నాయి. 20న ఫస్టియర్‌కు, 21న సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ప్రధాన పరీక్షలు మే ఐదో తేదీతో ముగియనుండగా, మైనర్ సబ్జెక్టులకు మే 10 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ సోమవారం పరీక్షల టైం టేబుల్‌ను విడుదల (TS Inter 1st, 2nd Year Timetable Released) చేశారు. పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడుగంటలపాటు నిర్వహిస్తారు.
మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఆదివారాల్లో సైతం ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తామని జలీల్ ప్రకటించారు. ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్షలను ఏప్రిల్ 11, 12 తేదీల్లో నిర్వహిస్తామని చెప్పారు. గతంలో విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్స్, మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు జరుగాల్సి ఉన్నది. కానీ, కరోనా మూడోవేవ్ కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేశారు.
ఇంటర్ పరీక్షల టైం టేబుల్ కావడంతో ఇక ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలకావాల్సి ఉన్నది. ప్రధాన పరీక్షలు మే 5వ తేదీతో ముగియనుండగా.. మే 6 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.