UPSC ISS, IES 2023 Results: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‍‌, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌ తుది ఫలితాలు విడుదల, నియామకాల ప్రక్రియ ఇలా!

UPSC ISS, IES 2023 Results

UPSC ISS, IES 2023 Results: గత ఏడాది జూన్ 23-25 తేదీల్లో నిర్వహించిన ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‍‌, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. వీటితో పాటు డిసెంబర్‌ 18-21 తేదీల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను కూడా యూనియన్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

ISSC 2023 పరీక్షలో నిఖిల్ సింగ్ అగ్రస్థానంలో నిలవగా, జాన్హవి పటేల్ ద్వితీయ, విజయ్ లధా తృతీయ స్థానాల్లో నిలిచారు. IES పరీక్ష 2023లో, నిశ్చల్ మిట్టల్ అగ్రస్థానంలో నిలవగా, అదితి ఝా రెండవ స్థానంలో, పూర్ణిమ సుదేన్ మూడవ ర్యాంక్ సాధించారు.

మొత్తంగా, IES కోసం 18 మంది అభ్యర్థులు, ISS కోసం 33 మంది అభ్యర్థులను కమిషన్ సిఫార్సు చేసింది. అభ్యర్థులు అందుబాటులో లేనందున, జనరల్‌ విభాగంలో 01 ఉద్యోగాన్ని ఖాళీగా ఉంచారు.

పైన పేర్కొన్నట్లుగా జూన్ 23 నుండి 25 వరకు జరిగిన రాత పరీక్ష, డిసెంబర్ 18 నుండి 21 వరకు జరిగిన ఇంటర్వ్యూలు/వ్యక్తిత్వ పరీక్షల ఆధారంగా తుది ఫలితాలు సిద్ధం చేయబడ్డాయి. ఈ ఫలితాలు యూపీఎస్‌సీ వెబ్‌సైట్ www.upsc.gov.inలో అందుబాటులో ఉంటాయి. ఫలితాల ప్రచురణ తేదీ నుంచి 15 రోజుల్లోగా అభ్యర్థుల మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు జరుగుతాయి. అభ్యర్థుల అసలు ధృవపత్రాలను కమిషన్‌ పరిశీలించే వరకు, తాత్కాలిక స్థితిలో ఉన్న అభ్యర్థులకు నియామక పత్రం జారీ చేయరు. తుది ఫలితం ప్రకటించిన తేదీ నుంచి మూడు నెలల వరకు మాత్రమే ఆ అభ్యర్థుల తాత్కాలిక స్థితి చెల్లుబాటు అవుతుంది. ఆ గడువులోగా కమిషన్ కోరిన అవసరమైన పత్రాలను అభ్యర్థి సమర్పించాలి. ఇందులో విఫలమైతే ఆ వ్యక్తి అభ్యర్థిత్వం రద్దవుతుంది. ఈ విషయంలో తదుపరి సంప్రదింపులకు తావుండదు.

యూపీఎస్‌సీ ప్రాంగణంలోని పరీక్ష కేంద్రానికి సమీపంలో 'సహాయక కేంద్రం' ఉంది. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉన్నా, సమాచారం కోసమైనా పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. లేదా 011-23385271, 23381125 టెలిఫోన్ నంబర్లకు కాల్‌ చేసి గానీ సమాధానాలు పొందవచ్చు.