
Vjy, Mar 5: ఏపీలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీడీపీ మద్దతు తెలిపిన పేరాబత్తుల రాజశేఖరం, అలాగే ఉమ్మడి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం సాధించారు.
ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు రెండో రోజు మంగళవారం కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు.