
ఉత్కంఠ రేపిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమిపాలయ్యారు. గాదె శ్రీనివాసులు నాయుడు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయగా, ఎలిమినేషన్ లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమించారు. చివరికి శ్రీనివాసలు నాయుడు, రఘువర్మ మిగలగా... రెండో ప్రాధాన్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ (10,068) సాధించి విజయం అందుకున్నారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై (Uttarandhra Teacher MLC Election) వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాముసీఎం చంద్రబాబు సూచన మేరకు నడుచుకున్నామని... తొలి ప్రాధాన్యత ఓటు రఘువర్మకు, రెండో ప్రాధాన్యత ఓటు శ్రీనివాసులు నాయుడుకు వేయాలని చంద్రబాబు సూచించారని వివరించారు. టీడీపీ రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు ఇద్దరినీ బలపరిచిందని స్పష్టం చేశారు.
కానీ వైసీపీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ ముసుగులో పోటీ పెట్టిందని విమర్శించారు. అటు పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ ముసుగులో నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు.