Weather Forecast: వెదర్ అలర్ట్, పలు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు, ఈ రోజు అనుకోని వర్షంతో తడిసి ముద్దయిన చెన్నై, రాబోయే 24 గంటల్లో కోస్తా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం
బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలతోపాటు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భాలో కూడా నేడు, రేపు వర్షపాతం ఉంటుంది.
దేశంలో పలు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ( IMD) హెచ్చరికలు జారీ చేసింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలతోపాటు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భాలో కూడా నేడు, రేపు వర్షపాతం ఉంటుంది. తర్వాత ఐదు రోజులలో పొడి వాతావరణం ఉంటుందని అంచనా. ఐతే ఈశాన్య భారతదేశంలో రెండు రోజులపాటు పొడిగా ఉంటుంది.
ఉత్తర భారతంలో మాత్రం జనవరి 5 నుంచి 7 మధ్య చలిగాలులు వీచే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో పగటిపూట, అర్థరాత్రి సమయాల్లో దట్టంగా మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 5 నుండి 7 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో జనవరి 6, 7 తేదీల్లో తేలికపాటి వర్షాలు (Rains) కురుస్తాయని పేర్కొంది. రానున్న 2,3 రోజుల్లో చలిగాలుల (Cold wave sweeps) కారణంగా పంజాబ్‌లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెల్పింది.
Here's India Meteorological Department Tweet
Tamil Nadu Weatherman Tweet
వర్షం మరోమారు చెన్నైని (Chennai Rains) ముద్దాడింది. మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వర్షం మొదలుకాగా, సాయంత్రం 5.30 గంటల సమయానికి 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ప్రముఖ వాతావరణ బ్లాగర్ ప్రదీప్ జాన్ అలియాస్ తమిళనాడు వెదర్‌మేన్ (Pradeep John (Tamil Nadu Weatherman) వర్షంపై ట్వీట్ చేశాడు.
మైలాపూర్‌లో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నాడు. ఇది 2015 నాటి వార్షిక వర్షపాతాన్ని అధిగమించినట్టు తెలిపాడు. చెన్నై మీదుగా దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయని, చూస్తుంటే ఇప్పట్లో వర్షం తగ్గేలా కనిపించడం లేదని పేర్కొన్నాడు. ఇంటికి క్షేమంగా చేరుకోవాలని, టి.నగర్, అల్వార్‌పేట్, రోయపేట, నుంగా తదితర ప్రాంతాల వాసులు జాగ్రత్తగా ఉండాలని, వాహనదారులు అటువైపు వెళ్లొద్దని హెచ్చరించాడు.
Tamil Nadu Weatherman Tweet
ఇక కోస్తా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న కూడా కోస్తా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసినట్టు సమాచారం. బంగాళాఖాతం నుండి కోస్తాంధ్ర పైకి తేమతోకూడిన తూర్పు గాలులు వీస్తున్నాయని వాటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఉత్తరాది మీదుగా పశ్చిమ గాలులు వీస్తుండటంతో రేపటి నుండి కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో నిన్న వర్షాలు కురిసాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. దాంతో ప్రజలంతా అవాక్కయ్యారు. వర్ష ప్రభావంతో జిల్లాలో ఈదురు గాలులు వీస్తున్నాయి.