Cyclone Arnab: మళ్లీ ఇంకో తుఫాను దూసుకొస్తోంది, అర్నబ్ తుఫాన్‌గా నామకరణం, హిందూ మహాసముద్రంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని అంచనా
నివర్, బురెవి తుఫాన్లు మిగిల్చిన విధ్వంస పరిస్థితులకు తోడుగా అర్నబ్ తుఫాను (Next Cyclonic Storm) అల్ల కల్లోలం చేయడానికి రెడీ అవుతోంది. హిందూ మహాసముద్రంలో (Indian Ocean) గల్ఫ్ ఆఫ్ మన్నార్ సమీపంలో ఏర్పడుతుందని అంచనా వేస్తోన్న ఈ తుఫాన్‌కు ఆర్నబ్ తుఫాన్ అని పేరు పెట్టారు. బంగ్లాదేశ్ ఈ పేరును సూచించింది.
Chennaai, Dec 6: బురేవి తుఫాన్ కల్లోలం మరచిపోకముందే మరో తుఫాన్ (Cyclone Arnab) తమిళనాడును మరికొన్ని రాష్ట్రాలను వణికించడానికి రెడీ అయింది. నివర్, బురెవి తుఫాన్లు మిగిల్చిన విధ్వంస పరిస్థితులకు తోడుగా అర్నబ్ తుఫాను (Next Cyclonic Storm) అల్ల కల్లోలం చేయడానికి రెడీ అవుతోంది. హిందూ మహాసముద్రంలో (Indian Ocean) గల్ఫ్ ఆఫ్ మన్నార్ సమీపంలో ఏర్పడుతుందని అంచనా వేస్తోన్న ఈ తుఫాన్‌కు ఆర్నబ్ తుఫాన్ అని పేరు పెట్టారు. బంగ్లాదేశ్ ఈ పేరును సూచించింది.
హిందూ మహా సముద్రంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది మరింత బలపడటానికి అవసరమైన అనుకూల వాతావరణం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో 7,8 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. వచ్చే 72 గంటల్లో ఇది మరింత బలపడుతుందని, వాయుగుండంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. కొత్త అల్పపీడనం ప్రభావంతో కేరళ, కర్ణాటక దక్షిణ ప్రాంతం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ అల్ప పీడనం బలపడి అర్నబ్ తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్, బురెవి తుఫాన్లు తూర్పు దిశ నుంచి దాడి చేయగా.. ఈ సారి అరేబియా సముద్రం నుంచి దాడి మొదలు కానుంది. బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహా సముద్రం ఉపరితల వాతావరణంలో చోటు చేసుకుంటోన్న అనూహ్య మార్పుల ఫలితంగా వెంటవెంటనే తుఫాన్లు పుట్టుకుని రావడానికి కారణమౌతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకే సీజన్‌లో..కొన్ని రోజుల స్వల్ప వ్యవధిలో అల్పపీడనం ఏర్పడటం అరుదుగా భావిస్తున్నారు.
బురెవి తుఫాన్ బలహీనపడిన గల్ఫ్ ఆఫ్ మన్నార్‌కు (Gulf of Mannar) ఆనుకుని హిందూ మహాసముద్రంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడి సముద్రం అల్లకల్లోలంగా ఉందని అధికారులు అన్నారు. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల పాటు తమిళనాడు, కేరళల్లో మరన్ని భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితే ఇక ముందూ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.
ఈ అల్పపీడనం ప్రభావం వల్ల కేరళలో తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఇడుక్కి, మళప్పురం, తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ సహా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాలు, తమిళనాడు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తిరువనంతపురంలోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే సంతోష్ తెలిపారు. వచ్చేవారం రోజుల్లో కేరళలో మరింత అధిక వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి నియమించిన కేంద్ర బృందం చెన్నైకి చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి అశుతోష్ అగ్నిహోత్రి ఈ బృందానికి సారథ్యాన్ని వహిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం నష్టాన్ని అంచనా వేస్తుంది. కాగా.. నివర్, బురెవి తుఫాన్ల కారణంగా 3,758.55 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ఎంత మేర నిధులను కేటాయిస్తుందనేది ఇంకా తేలాల్సి ఉంది. నష్టం అంచనాతో కూడిన ప్రతిపాదనలను తాము కేంద్రానికి పంపించినట్లు తమిళనాడు రెవెన్యూశాఖ మంత్రి ఉదయ కుమార్ తెలిపారు.