Chennai, Dec 6: తమిళనాడు రాష్ట్రాన్ని బురేవి తుఫాను (Burevi Cyclone) వణికించింది. తుఫాను కారణంగా ఏడుగురు మరణించారని అధికారులు ప్రకటించారు. అయితే అనధికార సమాచారం ప్రకారం ఈ సంఖ్య మరింతగా ఉన్నట్లు తెలుస్తోంది. వందలాది గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. వరుసగా రెండు రోజుల పాటు ఈ తుఫాన్ (Cyclone Burevi) తమిళనాడును వణికించింది. కడలూరు జిల్లాలో 300 గ్రామాలు వరదలకు ప్రభావితం కాగా, రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం యొక్క పెద్ద ప్రాంతాల్లో విద్యుత్ పూర్తిగా స్థంభించిపోయింది.
ఇదిలా ఉంటే బురేవి తుపాను మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. తమిళనాడు (Tamil Nadu) రామనాథపురానికి నైరుతిలో 40 కిలోమీటర్లు పంబన్‌కు నైరుతి దిశగా 70 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. దక్షిణ అండమాన్‌ను అనుకుని, మాలే ద్వీపకల్పలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు, అలాగే ఇళ్లు, పశువులు కోల్పోయినందుకు కూడా పరిహారం ప్రకటించారు. భారీ వర్షాలకు వందలాది మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ప్రతి ఆవును పోగొట్టుకున్నందుకు రూ. 30,000, దూడకు, రూ. 16,000, మేకకు రూ. 3,000 చెల్లించనున్నట్లు రాష్ట్రం తెలిపింది. యుద్ధ ప్రాతిపదికన" తుఫాను ఉపశమనం, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. తుఫాను ప్రభావిత జిల్లాల్లో పునరావాసంపై వ్యక్తిగతంగా పర్యవేక్షించడానికి మంత్రులను నియమించినట్లు ముఖ్యమంత్రి శనివారం చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని 10 మంది మంత్రులను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదేశించారు. నివర్ (Nivar) తుఫాన్ చేసిన బీభత్సం మరిచిపోకముందే మరో తుపాన్ కకావికలం చేస్తుండటంతో తమిళనాడు వాసులు కుదేలవుతున్నారు. బురేవి తుఫాన్ ప్రభావానికి తమిళనాడులో 75 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. మరో 1725 గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 10 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటు కేరళను కూడా తుఫాన్ అతలాకుతలం చేస్తోంది.
తుఫాన్ ప్రభావిత జిల్లాలైన పత్తినంథిట్ట, కోచ్చి, తిరువనంతపురంలల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేసింది. తమిళనాడులో తుఫాన్ వల్ల 75 గుడిసెలు నేలమట్టం అయ్యాయి. మరో రెండు వేలకు పైగా పూరి గుడిసెలు, పక్కా గృహాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. వందలాది పశువులు మరణించాయి. వాటికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు వరద సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి.
రాబోయే 48 గంటలలో తమిళనాడు మరియు పుదుచ్చేరికి మరింత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఉదయం నాటికి మాంద్యం రామనాథపురానికి నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలి వేగం కలిగి ఉంది.