Cyclone Jawad: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, అనంతరం జావద్ తుఫాన్‌గా మారే అవకాశం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు
దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. ఇది మరింత బలపడి నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశాలున్నాయి.
New Delhi, October 11: బంగాళాఖాతంలో అండమాన్ దీవుల పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో సోమవారం అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. ఇది మరింత బలపడి నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి గాలులతో ఉపరితల ద్రోణి 1500 మీటర్ల ఎత్తున.. కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా అరేబియా సముద్రంపై ఉన్న మరో ఉపరితల ఆవర్తనం వరకు వ్యాపించింది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల ఇది తదుపరి నాలుగైదు రోజుల్లో మరింత బలపడి తుపానుగా (Cyclone Jawad May Be Formed This Week) మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తుఫానుగా బలపడితే దీనికి జావద్ తుఫానుగా (Cyclone Jawad) నామకరణం చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది దిశ మార్చుకుని బర్మా మీదుగా ప్రయాణించనుంది.
బర్మా సమీపానికి వెళ్లిన తర్వాత మళ్లీ దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు (Odisha-Andhra Pradesh Coasts) రానుంది. ఫలితంగా ఈ తుపాను ప్రభావమంతా ఒడిశాపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండురోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23 లేదా 24వ తేదీన వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.