Heatwave Alert: తెలంగాణ, ఏపీ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు తీవ్ర వడగాల్పులు.. జాగ్రత్తగా ఉండాలంటూ భారత వాతావరణ విభాగం హెచ్చరిక
తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
Hyderabad, June 19: వచ్చే మూడు రోజులపాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో (States) తీవ్ర వడగాల్పులు (Heatwaves) వీస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. తెలంగాణ (Telangana), ఏపీ (AP), ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఐఎండీ.. ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడమే మేలని .. ఒకవేళ బయటకు వెళ్తే తలకు తప్పనిసరిగా వస్త్రం చుట్టుకోవాలని, గొడుగు తీసుకెళ్లాలని సూచించింది. దాహం వేయకున్నా.. నీరు తాగాలని, దీని వల్ల డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండొచ్చని తెలిపింది. వృద్ధులు, చిన్నారులు ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగ, నిమ్మరసం, లస్సీ తాగాలని తెలిపింది.
వడదెబ్బ కారణంగా 54 మంది మృతి
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 24 వరకు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తరాదిన కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజుల్లోనే వడదెబ్బ కారణంగా అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు.