AP Weather Report: ఏపీలో మారిపోయిన వాతావరణం, రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఈ మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు... మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగించాయి. కమ్ముకు వచ్చిన మేఘాలు, ఈదురు గాలులు, వర్షంతో వాతావరణం చల్లబడింది.
ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు... మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగించాయి. కమ్ముకు వచ్చిన మేఘాలు, ఈదురు గాలులు, వర్షంతో వాతావరణం చల్లబడింది.
ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో ఏపీలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.రాజోలు మండలం తాటిపాకలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఏలూరు జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో వర్షం పడింది. నెల్లూరు నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది.
నెల్లూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల కటౌట్లు కూలిపోయాయి... ఫ్లెక్సీలు ధ్వంసం అయ్యాయి. నెల్లూరు జిల్లాలోని కావలి, కందుకూరు, గూడూరు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తిరుపతి జిల్లా వెంకటగిరి, బాలాయపల్లి మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురిసినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడలోనూ ఈ మధ్యాహ్నం కురిసిన వర్షంతో ప్రజలు సేదదీరారు.