Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు, రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే దంచి కొడుతున్న వానలు, ఉష్ణోగ్రత తగ్గి పెరుగుతున్న చలి
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.
ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి విదర్భ, చత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు (Weather Forecast) అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాతోపాటు రాయలసీమలో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం (Rain forecast three days) ఉందని హెచ్చరించారు.రేపటి వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. మూడు రొజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
కాగా గుంటూరు, కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ, విశాఖ నగరాల్లోని పలుచోట్ల వీధులు, రోడ్లు జలమయమయ్యాయి. మరో మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో శృంగవరపు కోటలో అత్యధికంగా 86 మి.మీ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో తూర్పు గాలులు బలంగా వీస్తుండడంతో నిన్న కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శృంగవరపు కోటలో 9, పార్వతీపురంలో 8, పొన్నూరు, మంగళగిరి, గొలుగొండ్లలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్టణంలోనూ గత రాత్రి భారీ వర్షం కురిసింది.
గత వారం రోజులుగా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కూడా పలు జిల్లాలో మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా, మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక నిన్న వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగలవారి పేటలో అత్యధికంగా 87.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మహబూబాబాద్ జిల్లాలోని ఉప్పరగూడెంలో 68.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, ములుగు, హైదరాబాద్, మేడ్చల్ మాల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ చెదురుమదురు వానలు కురిశాయి. మరోవైపు నిన్న పగటి ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠంగా 14.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15.2, నిర్మల్‌లో 15.7, నిజామాబాద్‌లో 16.2, నారాయణపేటలో 16.8, వికారాబాద్‌లో 17.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.