Monsoon for Telangana: జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు, ఈ నెల 22వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే.

rains

Hyd, May 20: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీ నాటికి ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశలో కదిలి ఈ నెల 24 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.  ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం, ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించి... ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. మరో ద్రోణి దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని తెలిపింది.

దీంతో ఏపీలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.అలాగే తెలంగాణలో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మంగళవారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు పడుతాయని తెలిపింది. 22న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, వనపర్తి, తదితర జిల్లాల్లో వానలు కురిసే అవకాశముందని పేర్కొంది.

నగరంలో మళ్లీ భారీ వాన దంచికొడుతోంది. సోమవారం మధ్యాహ్నాం పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. నగరంతో పాటు రాష్ట్రంలో ఈ నాలుగురోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.