Weather Forecast: బలహీనపడిన వాయుగుండం, ఏపీకి తప్పిన భారీ వర్షాల ముప్పు, నెల్లూరు జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం
ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మంగళవారం బలహీనపడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో కొనసాగుతోంది. అక్కడ నుంచి నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.
ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు కోస్తాలో ఒకటిరెండు చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
శభాష్ పోలీస్, బాపట్ల బీచులో సముద్ర స్నానం చేస్తూ మునిగిపోయిన యువతుల ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు..
అల్పపీడనం ప్రభావంతో తీర ప్రాంతల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులతో తీరప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది.అల్పపీడనం ప్రభావంతో దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇక చెన్నై నగరాన్ని సైతం భారీ వర్షం బెంబేలెత్తిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో గురువారం వరకు ఏపీలోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ తెలిపింది.