Manoj Tiwari: డిప్యూటీ సీఎం రాజీనామాతో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాళీ, సీఎం తప్ప ఎవరూ మిగలరు, ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు, మరికొన్ని నెలల్లో ఢిల్లీలో మోగనున్న ఎన్నికల నగారా
మరికొన్ని నెలల్లో దేశ రాజధానిలో ఎన్నికల నగారా మోగనుండటంతో ఇప్పటి నుంచి రాజకీయ పార్టీల మధ్య వార్ మొదలైంది.ఈ నేపథ్యంలోనే బిజెపి ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ ( Delhi Bjp chief Manoj Tiwari) సంచలన వ్యాఖ్యలు చేశారు.
New Delhi, September 23: మరికొన్ని నెలల్లో దేశ రాజధానిలో ఎన్నికల నగారా మోగనుండటంతో ఇప్పటి నుంచి రాజకీయ పార్టీల మధ్య వార్ మొదలైంది. ఇప్పుడు ప్రధానంగా బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ( Aam aadmi party)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీలు అంతర్గత కలహాలను బిజెపి తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే బిజెపి ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ ( Delhi Bjp chief Manoj Tiwari) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార ఆమ్‌ఆద్మీ పార్టీలో ముసలం మొదలైందని రానున్న కాలంలో ముఖ్య నేతలంతా ఆప్ పార్టీని వీడుతారని మనోజ్ తివారీ జోస్యం చెప్పారు. వీరిలో ఉపముఖ్యమంత్రి, సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా ఉన్నారని, ఆయన ఏ క్షణమైన పార్టీని వీడే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని నెలల్లో దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి అంతర్గత కలహాలు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయని తెలుస్తోంది.
2020 ఫిబ్రవరి నాటికి ఢిల్లీ అసెంబ్లీ గడవు ముగుస్తున్న తరుణంలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. ఇందులో భాగంగానే మనోజ్ తివారి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల లోపు ఆప్‌లో కేవలం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే మిగులుతారని జోస్యం చెప్పారు. కేజ్రీవాల్ తీరుతో, పార్టీ సిద్దాంతాలతో విసిగిపోయిన అనేక నేతలు ఇప్పటికే గుడ్‌బై చెప్పినట్లు ఆయన ఈ సంధర్భంగా గుర్తుచేశారు. రాజకీయాలను ప్రక్షాళన చేస్తామనే నినాదంతో ఆప్‌లో చేరిన ముఖ్యలు మోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషన్, ఆనంద్ కుమార్, కుమార్ విశ్వాస్‌తో వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారంటూ ఆయన ప్రశ్నించారు.
గడిచిన ఏడాది కాలంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడారని, రానున్న కాలంలో ఆప్ ఖాళీ కావడం తప్పదని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ వైఖరితో ఆ పార్టీ నేతలే కాకా ప్రజలు కూడా విసిగిపోయారని రానున్న ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ విజయ బావుటా ఎగరవేయడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూడా ఎన్‌ఆర్‌సీని అమలు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని తివారి తెలిపారు. ఇదిలా ఉంటే ఆప్ ముఖ్యనేత, ఎమ్మెల్యే అల్కా లాంబా ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా అనంతరం ఆమె కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతకుముందే ఎమ్మెల్యే కపిల్ మిశ్రా కూడా ఆప్‌ను వీడి బీజేపీలో చేరారు. మరి అరవింద్ కేజ్రీవాల్ ఈ సారి ఎటువంటి వ్యూహాలతో బరిలోకి దిగుతారు, పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను ఎలా పరిష్కరించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.