Midday Meal Scheme In UP: బకెట్ నీళ్లు..లీటరు పాలు, తాగమంటూ పిల్లలకు ఇచ్చిన వంట మనిషి, యూపీలో ఘటన, ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఈ పథకానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే వాటి ఫలాలు మాత్రం విద్యార్థులకు అందడం లేదని మరోసారి రుజువైంది.
Lucknow, November 29: ప్రభుత్వ పాఠశాలకు పంపితే చదువుతో పాటు మధ్యాహ్న భోజన పథకం ద్వారా తమ పిల్లల కడుపు కూడా నిండుతుందని ఆశపడే నిరుపేదలు దేశంలో ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఈ పథకానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే వాటి ఫలాలు మాత్రం విద్యార్థులకు అందడం లేదని మరోసారి రుజువైంది. లీటరు పాలల్లో బకెట్ నీళ్లు కలిపి విద్యార్థులకు అందిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ సోనభద్ర ( Uttar Pradesh's Sonbhadra)జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం(Government's mid-day meal programme)లో భాగంగా విద్యార్థులకు ప్రతి రోజు గ్లాస్ పాలు ఇస్తున్నారు. ఆ పాఠశాల( government primary school at Sonbhadra)లో మొత్తం విద్యార్థుల సంఖ్య 171 కాగా, ఈ నెల 27వ తేదీన 81 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఆ రోజు ఒక లీటర్ పాలల్లో బకెట్ నీళ్లు (one-litre milk with a bucket of water)కలిపింది వంట మనిషి. ఆ తర్వాత పాలను వేడి చేసి ఒక్కో విద్యార్థికి పాలను సగం గ్లాస్ మాత్రమే పంపిణీ చేసింది. ఈ దృశ్యాలను అక్కడున్న ఒకరు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ANI Tweet
అయితే ఈ విషయం వెలుగులోకి రాగానే స్కూలు నిర్వాహకులు ఈ ఆరోపణల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియో విద్యాశాఖ ఉన్నతాధికారుల దాకా చేరింది. దీంతో ఆ సమయంలో పాఠశాలలో విధుల్లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సభ్యుడు (member of the gram panchayat) దేవ్ కలియా మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న ఆహారంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపించారు. అయితే గ్రామంలోని విద్యార్థులు మరోమార్గం లేక అదే ఆహారాన్ని తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ అధికారుల ఇప్పటికైనా స్పందించాలని దేవ్ కలియా కోరుతున్నారు.
ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం యూపీలోని మీర్జాపూర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులకు రోజూ రోటీ- ఉప్పు, అన్నం- ఉప్పు పెడుతున్న విషయాన్ని ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. . ఈ క్రమంలో ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే అతడు కుట్ర పన్నాడంటూ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.