Chhattisgarh Encounter: ప్లాన్ ప్రకారమే మావోయిస్టుల దాడి, అమరులైన 22 మంది జవాన్లు, 21 మంది మిస్సింగ్, గాయాలతో 30 మంది, ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనపై హోంమంత్రి అమిత్ షా ఆరా, జవాన్ల మృతి పట్ల సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ
బీజాపూర్‌లోని తెర్రాం ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎదురు కాల్పుల్లో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని (22 soldiers killed in encounter) బీజాపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కమలోచన్ కాశ్యప్ ఆదివారం చెప్పారు.
Raipur, April 4: భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం (Chhattisgarh Encounter) దద్దరిల్లింది. బీజాపూర్‌లోని తెర్రాం ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎదురు కాల్పుల్లో 22 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని (22 soldiers killed in encounter) బీజాపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కమలోచన్ కాశ్యప్ ఆదివారం చెప్పారు. 15 మృత దేహాలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనలో 30 మంది గాయపడినట్లు, 21 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు తెలిపారు.
మరో 31 మంది జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఒక మహిళా మావోతో పాటు మొత్తం 15 మంది మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలిసింది. ఆదివారం కూడా ఇరు వర్గాల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అయితే, మరికొంతమంది జవాన్లు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెప్తున్నారు.
మొత్తం రెండు వేల మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొనగా, సుమారు వెయ్యి మందితో కూడిన మావోయిస్టు గెరిల్లా ఆర్మీ గుట్టలపై నుంచి జవాన్లపై మెరుపు దాడి చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో మావోయిస్టులు మోటార్ లాంచర్‌లను కూడా వినియోగించినట్లు సమాచారం. ఈ ఘటనలో గల్లంతైన జవాన్ల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. కాగా, ఈ ఘటనకు సంబంధించి అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఎదురు కాల్పుల్లో మృతిచెందిన జవాన్లలో కోబ్రా దళానికి చెందిన ఒకరు, ఎస్టీఎఫ్ విభాగానికి చెందిన ఇద్దరు, డీఆర్జీ విభానికి చెందిన ఇద్దరు జవాన్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ల ద్వారా రాయ్పూర్, బీజాపూర్ ఆసుపత్రులకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. కాల్పులు జరిగిన సమయంలో స్పాట్ లో ఉన్న 760మంది జవాన్లు ఉన్నట్టు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియడానికి మరో ఆరుగంటలపైన సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. ఆచూకీ తెలియకుండాపోయిన భద్రతా సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు.
Chhattisgarh Chief Minister Bhupesh Baghel Tweets
కాగా, ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటనపై హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఆరా తీశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్‌కు (Chhattisgarh Chief Minister Bhupesh Baghel) ఫోన్ చేశారు. బీజాపూర్ జిల్లాలోని టర్రెం సమీపంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ ఘటనపై ఆరా తీశారు. ఈ ఎన్‌కౌంటర్లో భద్రతా సిబ్బంది అమరులుకావడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Home Minister Tweet
అమిత్ షా ఇచ్చిన ఓ ట్వీట్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో జరిగిన పోరాటంలో అమరులైన భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలకు, త్యాగాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. వీరి పరాక్రమాన్ని దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని తెలిపారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాంతి, అభివృద్ధిలకు శత్రువులుగా వ్యవహరిస్తున్నవారితో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ, ఛత్తీస్ గఢ్ సీఏం అమర జవాన్ల మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
PM Modi Tweet
కాగా మావోయిస్టులు పక్కా ప్లాన్ ప్రకారమే భద్రతాసిబ్బందిపై దాడి చేశారని సీఆర్‌పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్‌కు వస్తున్న సంగతి తెలుసుకున్న మావోయిస్టులు లైట్ మెషిన్ గన్‌లు, అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్, దేశీ రాకెట్లను సిద్ధం చేసుకుని సురక్షిత ప్రాంతంలో దాగి ఉన్నారని, బలగాలు మొత్తం వాళ్లు ప్లాన్ చేసిన ప్రదేశంలోకి వచ్చేదాకా ఎదురుచూసి ఒక్కసారిగా అన్నివైపుల నుంచి దాడికి పాల్పడ్డారని వెల్లడించారు.
శనివారం రాత్రి సీఆర్‌పీఎఫ్ బలగాలతోపాటు యాంటీ మావోయిస్ట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBra) యూనిట్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ (DRG), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF) విభాగాలకు చెందిన మొత్తం 400 మంది భద్రతాసిబ్బంది సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లినట్లు సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.
ఈ సమాచారాన్ని ముందే తెలుసుకున్న మావోయిస్టులు తమకు అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని, అక్కడికి బలగాలు పూర్తిగా చేరుకోగానే దాడికి పాల్పడ్డారని సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ చెప్పారు. మొత్తం 350 మంది సాయుధులైన సీపీఐ మావోయిస్టులు, వారి సానుభూతిపరులైన మరో 250 మంది జన్ మిలిషియా భద్రతాబలగాలపై దాడికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. అయితే, మావోల దాడిని బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయని, మావోయిస్టుల వైపుకు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగిందని చెప్పారు.
మావోయిస్టులు తమవైపు నుంచి మృతిచెందిన, గాయపడిన వారినందరినీ కలిపి మూడు ట్రాక్టర్లలో వేసుకెళ్లినట్లు ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లు చెబుతున్నారని, దాన్నిబట్టి మావోయిస్టుల వైపుకు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు స్పష్టమవుతున్నదని కుల్దీప్‌సింగ్ పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో శనివారం భద్రతాబలగాలపై దాడికి పాల్పడిన మావోయిస్టులు వారి చేతికి చిక్కిన జవాన్లను అత్యంత కిరాతకంగా చంపేశారని సీఆర్‌పీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక జవాన్‌ను చంపడానికి ముందు అతని చేతిని నరికేసి హింసించారు. అదేవిధంగా మరణించిన జవాన్ల నుంచి ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్లను కూడా ఎత్తుకెళ్లారు.