Encounter With Naxals (Photo Credits: PTI)

Raipur, April 4: ఛత్తీస్‌గఢ్‌ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం లో శనివారం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భారీగా ఎదురుకాల్పులు (Sukma Encounter Update) జరిగాయి. శనివారం మధ్యాహ్నం బీజాపూర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాలను డీఆర్జీ, ఎస్టీఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, కోబ్రా ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి.

తెర్రం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ జరిపిన 760 మంది జవాన్లకు 250 మంది మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు ( Chhattisgarh Encounter) మొదలయ్యాయి. ఈ ఘటనలో కోబ్రా దళానికి చెంది న ఒక జవాను, బస్తరీయ్‌(ఎస్టీఎఫ్‌) విభాగానికి చెందిన ఇద్దరు, డీఆర్జీకి చెందిన మరో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. 28 మంది గాయపడ్డారు.

మారుమూల ప్రాంతం కావడంతో వారిని ఆస్పత్రికి తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాల్పుల్లో గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించేందుకు రెండు ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చాయి. అయితే, అప్పటికి ఇంకా కాల్పులు కొనసాగుతుండటంతో వాటిని ల్యాండింగ్‌ చేయడం వీలుపడలేదు. దీంతో వాటిని తెర్రెం పోలీస్‌స్టేషన్‌ వద్ద ల్యాండింగ్‌ చేశారు. అనంతరం సుకుమా నుంచి 9 ప్రత్యేక అంబులెన్సులను సంఘటనా స్థలానికి పంపించి, గాయపడిన జవాన్లను తెర్రెం పోలీస్‌స్టేషన్‌ వద్దకు తీసుకొచ్చారు.

క్షణాల్లో కాలి బూడిద..హర్యానాలో అగ్నికి ఆహుతైన 700 గుడిసెలు, రోడ్డు మీద పడిన వందల కుటుంబాలు, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందనే అనుమానాలు

అక్కడి నుంచి భారత వాయు సేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఏడుగురు క్షతగాత్రులను రాయ్‌పూర్‌ ప్రభుత్వాస్పత్రికి, మరో 21 మందిని బీజాపూర్‌ దవాఖానాకు తరలించారు. నక్సల్స్‌ వైపు 9 మంది మృతిచెంది ఉంటారని ఐజీ వెల్లడించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నా రు. ఒక మహిళా నక్సల్‌ మృతదేహం లభ్యమైందని తెలిపారు. జవాన్ల మృతిపట్ల ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బగేల్‌, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.

మృతుల్లో ఆరుగురు డీఆర్‌జీ, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికీ 21 మంది జవాన్ల ఆచూకీ దొరకలేదని, గల్లంతైనవారి కోసం ఉదయాన్నే సెర్చ్ అండ్ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి భారీ ఎత్తున అదనపు బలగాలను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా, భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టులకు భారీగానే నష్టం కలిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నప్పటికీ.. ఒక్క మహిళా మావోయిస్టు మృతదేహం మాత్రమే లభ్యమైంది. మరోవైపు ఈ కాల్పుల ఘటనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోకి వచ్చే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లోని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు.