Acharya Santosh Trivedi: కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ముందు పూజారి ఆచార్య సంతోష్ త్రివేది నిరసన, చార్‌ధామ్ బోర్డును రద్దు చేయకుంటే నిరసన మరింత ఉగ్రరూపం దాలుస్తుందని హెచ్చరిక
ఉత్తరాఖండ్ చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటును నిరసిస్తూ ఆచార్య సంతోష్ త్రివేది (Acharya Santosh Trivedi) శీర్షాసనం ద్వారా తన నిరసన తెలిపారు.ఏడు రోజుల పాటు శీర్షాసనం ద్వారా తన నిరసన తెలపనున్నట్లు ఆచార్య వెల్లడించారు.
కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ముందు ఇవాళ ఓ పూజారి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉత్తరాఖండ్ చార్‌ధామ్ దేవస్థానం మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటును నిరసిస్తూ ఆచార్య సంతోష్ త్రివేది (Acharya Santosh Trivedi) శీర్షాసనం ద్వారా తన నిరసన తెలిపారు.ఏడు రోజుల పాటు శీర్షాసనం ద్వారా తన నిరసన తెలపనున్నట్లు ఆచార్య వెల్లడించారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చార్‌ధామ్ బోర్డును రద్దు చేయకుంటే, నిరసన మరింత ఉగ్రరూపం దాలుస్తుందని ఆయన తెలిపారు.
కొన్ని రోజులుగా కేదార్‌నాథ్ పూజారులు బోర్డుకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేపడుతున్నారు. గత నెలలోనే ఆలయాన్ని (Kedarnath Shrine) తెరిచారు. కరోనా నిబంధనల నేపథ్యంలో భక్తులను రానివ్వడం లేదు. కానీ పూజారులు మాత్రం యాధావిధిగా కేదారీశ్వరుడికి అభిషేకాలు చేస్తున్నారు. తాజాగా ఏర్పడిన బోర్డును వ్యతిరేకిస్తూ వాళ్లు ఇటీవల నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఒకవేళ బోర్డును రద్దు చేయకుంటే నిరాహారదీక్ష చేస్తామన్నారు.
మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలో.. గత ఏడాది జనవరి 15వ తేదీన ఉత్తరాఖండ్ ఛార్‌ధామ్ దేవస్థానం బోర్డును (Char Dham Devasthanam Management Board) ఏర్పాటు చేశారు. ఆ బోర్డులో చైర్మన్‌గా సీఎం ఉన్నారు. మరో మంత్రి వైస్ చైర్మెన్‌గా ఉన్నారు. గంగోత్రి, యమునోత్రికి చెందిన ఎమ్మెల్యేలు దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా ఆ బోర్డులో సభ్యుడే. రాష్ట్రంలోని 51 ఆలయాలు ఆ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఆ బోర్డును రద్దు చేయాలని కేదార్‌నాథ్ ఆలయ పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో కొత్త సీఎం తీరథ్ సింగ్ రావత్ ఆ బోర్డును సమీక్షించారు. ప్రభుత్వ ఆజమాయిషీ నుంచి ఆ 51 గుళ్లను తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Here's ANI Update
గతంలో గంగోత్రీ, యమునోత్రి ఆలయాలు స్థానిక ట్రస్టుల ఆధీనంలో ఉండేవి. ప్రభుత్వం ఎటుంటి నిధులు కేటాయించేది కాదు. అయితే బోర్డు ఏర్పాటుతో ఆలయాలతో పాటు విరాళాలపైన కూడా ప్రభుత్వ నియంత్రణ వస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బోర్డును రద్దు చేయాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు మాత్రం బోర్డు ఏర్పాటు పట్ల సుముఖంగా ఉన్నారని, ప్రభుత్వ జోక్యంతో ఆలయాల వద్ద వసతులు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారని మంత్రి సత్పాల్ మహారాజ్ అన్నారు.