Vijay Political Debut: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్, రాజకీయ పార్టీకోసం ఇప్పటికే అప్లై చేసుకున్న విజయ్ మక్కల్ ఇయక్కం, లోక్ సభ ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా పావులు
చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించిన విజయ్.. కొత్త పార్టీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Chennai, JAN 26: తమిళ నటుడు, ఇళయ దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయాల్లోకి వస్తున్నారంటూ, కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన కూడా ఎప్పుడూ నోరు మెదపలేదు. అయితే, తాజాగా మరోసారి ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది (political debut). ఇందులో భాగంగానే త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు గురువారం చెన్నైలోని పనయూర్‌లో గల తన కార్యాలయంలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ (Vijay Makkal Iyakkam) నిర్వాహకులతో విజయ్ సమావేశం నిర్వహించారు.
చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించిన విజయ్.. కొత్త పార్టీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయ్ నిర్ణయంతో సభ్యులు రాజకీయ పార్టీ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు తమిళ రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది. మరో నెలరోజుల్లోనే విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలిసింది. ప్రకటన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? లేకపోతే ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వాలా? అన్నది అప్పుడు నిర్ణయిస్తారని టాక్. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.