IPL Auction 2025 Live

COVID in India: దేశంలో మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా, కొత్తగా 756 కేసులు నమోదు, గత 24 గంటల్లో నలుగురు మృతి

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో కొత్తగా 756 కేసులు బయటపడ్డాయి.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, Dec 23: భారత్‌లో కొత్త కరోనా వేరియంట్ జేఎన్.1 కారణంగా కరోనా (Coronavirus) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో కొత్తగా 756 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డానికి కొత్త వేరియంట్ (New Covid Variant) జేఎన్‌.1 (JN.1) కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు కాగా, రాజస్థాన్‌, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,332కి ఎగబాకింది.

ఆరు నెలల పసికందుకు కరోనా, ఒక్కసారిగా షాక్ తిన్న కోల్‌కతా వైద్యులు, కరోనా కొత్త వేరియంట్‌ జెఎన్‌ 1? కాదా? అనే దానిపై సస్పెన్స్

ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4.50 కోట్లకు (4,50,07,964) చేరింది. మహమ్మారి నుంచి 4,44,71,212 మంది కోలుకున్నారు. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.