IPL Auction 2025 Live

Farmers' Protest: మెట్టుదిగని ప్రభుత్వం..పట్టు వీడని రైతులు, ఫలించని హోం మంత్రి అమిత్ షా ప్రయత్నాలు, విఫలమైన ఆరో రౌండ్ చర్చలు, నేడు సింఘూ సరిహద్దులో రైతు సంఘాల సమావేశం

రైతు సంఘాలతో అదే రోజు సాయంత్రం ఏడుగంటలకు సమావేశం (Amit Shah's Meeting With Farmer Leaders) ఏర్పాటు చేశారు. అయితే అమిత్ షా ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం మెట్టు దిగకపోవడం అలాగే రైతులు పట్టు వీడకోవడంతో బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్‌ చర్చలు రద్దయ్యాయి.

AIKS leader Hannan Mollah after meeting with Amit Shah | (Photo Credits: ANI)

New Delhi, December 8: డిసెంబర్ 8న భారత్ బంద్ విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయి రైతుల ఆందోళనను విరమించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతు సంఘాలతో అదే రోజు సాయంత్రం ఏడుగంటలకు సమావేశం (Amit Shah's Meeting With Farmer Leaders) ఏర్పాటు చేశారు. అయితే అమిత్ షా ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వం మెట్టు దిగకపోవడం అలాగే రైతులు పట్టు వీడకోవడంతో బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్‌ చర్చలు రద్దయ్యాయి. ఇరు పక్షాలూ పూర్వ వాదనలకే కట్టుబడటంతో సమావేశాలు ఓ స్పష్టతకు రాలేదు. 14 రోజులుగా కొనసాగుతున్న రైతాంగ ఆందోళనను విరమింపజేసేందుకు ప్రధాని మోదో సర్కారు చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించడం లేదు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం ( Government Not Ready to Take Back Farm Laws) తేల్చి చెప్పింది. తామెలాంటి సవరణలు తేదల్చుకున్నదీ వివరిస్తూ ఓ ప్రతిపాదనను (Give Written Proposal) రైతులకు పంపనుంది. దానిని రైతు సంఘాల నేతల బుధవారం 12 గంటలకు సింఘూ సరిహద్దు కేంద్రం వద్ద సమావేశమై చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని షా తో సమావేశానంతరం బయటికొచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. నోటిఫైడ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెట్ కమిటీల్లో (ఏపీఎంసీ) ఫీజు నిర్మాణానికి సంబంధించిన సవరణలు, రైతుల భూ హక్కులను పరిరక్షించడానికి కఠినమైన నిబంధనలు, నోటిఫైడ్ మార్కెట్లను బలోపేతం చేయడం, కనీస మద్దతు ధరలపై (ఎంఎస్‌పీ) హామీ ఇవ్వాలని రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సవరణల ప్రతిపాదనలను బుధవారం రైతులకు కేంద ప్రభుత్వం లిఖితపూర్వకంగా అందించనుంది.

రాష్ట్రపతిని కలవనున్న విపక్ష నేతలు, రైతుల అభ్యంతరాలను కోవింద్‌కు వివరించనున్న ప్రతిపక్షాలు, చట్టాల రద్దు అసాధ్యమని, సవరణలు చేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం

సవరణ జాబితాపై రైతు సంఘాల నేతలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు ఢిల్లీ సరిహద్దుల్లో 14వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతోంది. సింఘు, టిక్రి, ఘాజీపూర్‌, నోయిడా సరిహద్దుల్లో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్న రైతు సంఘాలు సమావేశం కానున్నాయి. కేంద్రం అందించే జాబితాపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమిత్ షా నివాసంలో చర్చలకు కొందరు రైతునేతలు విముఖత చూపడంతో పూసా ఏరియాలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద సమావేశం షెడ్యూల్డ్‌ సమయం కంటే రెండు గంటల ఆలస్యంగా రాత్రి తొమ్మిది గంటలకు మొదలైంది. ఇందులో పాల్గొన్న 13 మందిలో ఎనిమిది మంది పంజాబీ రైతు సంఘాల వారు కాగా మిగిలిన ఐదుగురూ దేశంలోని వివిధ యూనియన్లకు చెందినవారు. ఆలిండియా కిసాన్‌ సభకు చెందిన హన్నన్‌ మొల్లా, భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన రాకేశ్‌ తికాయత్‌ వారిలో ఉన్నారు. అమిత్‌ షాతో చర్చించేందుకు ఏమీ లేదని, చట్టాలను (Farm Reform Laws) రద్దు చేస్తారా లేదా... అవును లేదా కాదు... అన్నది మాత్రమే అడుగుతున్నామని రైతు నేత రుద్రు సింగ్‌ మాన్సా సమావేశానికి ముందే చెప్పారు.

భారత్ బంద్ విజయవంతం, రాత్రి ఏడుగంటలకు హోంమంత్రి అమిత్ షాతో రైతు సంఘాల భేటీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హౌస్ అరెస్ట్, పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని తెలిపిన ప్రధాని మోదీ

సమావేశం కూడా ఆ తరహాలోనే సాగింది. రైతు నేతలిచ్చిన సమాచారం ప్రకారం... చేసిన చట్టాల్ని రద్దు చేయడం అసాధ్యమని అమిత్‌ షా స్పష్టం చేశారు. రద్దు మినహా ఏ తరహా సవరణలకైనా సిద్ధంగా ఉన్నామని తెలియపర్చారు. సవరణలకు తాము వ్యతిరేకమని, ఇందులో మార్పు లేదని రైతు నేతలు తేల్చిచెప్పారు. ఆ సమయంలో షా వారి ముందు ప్రతిపాదన ఉంచారు. ‘చట్టాలపై మీకున్న 39 అభ్యంతరాలనూ పరిశీలించాం ప్రభుత్వం ఏమేం సవరణలు చేయదలిచిందీ మీకు పంపిస్తాం... పరిశీలించండి’ అని కోరారు. రైతు సంఘాల నేతలు అందుకు అంగీకరించారు.

ఈమేరకు బుధవారం నరేంద్ర తోమర్‌, పీయూష్‌ గోయల్‌ సారథ్యంలోని ప్రభుత్వ బృందంతో తాము జరిపే చర్చలను రద్దు చేసినట్లు కిసాన్‌ సభ నేత హన్నన్‌ మోలా రాత్రి 11-30 గంటలకు మీడియాకు చెప్పారు. ప్రభుత్వంపై తమకు విశ్వాసం కలగడం లేదని చెప్పిన కొందరు రైతు ప్రతినిధులు ఆందోళనను ఉధృతం చేయడమే మార్గాంతరమంటున్నారు. బుధవారం రైతులు తమలో తాము జరిపే చర్చల్లో ఏ విషయమూ ఖరారు కావొచ్చని తెలుస్తోంది.ఇదిలా ఉంటే భారత్‌ బంద్‌ కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపడం, దేశ విదేశాల్లో ప్రభుత్వ ఇమేజి దెబ్బతినే దిశగా సాగుతుండడంతో కేంద్రం కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.

రైతులకు మద్ధతుగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఎం నేత సీతారాం ఏచూరి డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటలకు అయిదుగురు సభ్యుల ప్రతినిధి వర్గం రాష్ట్రపతి కోవింద్‌ను కలుసుకోనుంది. రాహుల్‌, పవార్‌, ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డిఎంకె నేత టిఆర్‌ బాలు ఈ ప్రతినిధి వర్గంలో ఉన్నారు. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న సాగు చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నట్లు ఏచూరి వెల్లడించారు.