New Delhi, December 8: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై (New Farm Laws) రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను, రైతుల వ్యతిరేకతకు కారణాలను వివరించేందుకు రేపు సాయంత్రం 5 గంటలకు విపక్ష పార్టీల నేతలు (Opposition Leaders) రాష్ట్రపతి కోవింద్‌ను కలవనున్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు మరో ముగ్గురు రాష్ట్రపతితో (President Ram Nath Kovind) భేటీ కానున్నారు. కోవిడ్-19 ప్రొటోకాల్ నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం ఉందని సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారామ్ ఏచూరి చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు కదం తొక్కారు. లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ప్రజలకు ఇబ్బంది కలగరాదన్న ఉద్దేశంతో లాంఛనప్రాయంగా మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు బంద్ నిర్వహించారు. ఇప్పటి వరకు ఐదు సార్లు కేంద్రంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు బంద్‌కు పిలుపునిచ్చారు. కాగా రైతు సంఘాల నేతలతో కేంద్రం బుధవారం మరోసారి చర్చలు జరపనుంది.
రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఇంతవరకు తిరస్కరిస్తూ వచ్చింది. రైతులు సూచించిన సవరణలను చేస్తామని, చట్టాల రద్దు అసాధ్యమని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. బుధవారం జరిగే చర్చల్లో ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమం తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.