Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో విషాదం, భార్యను చంపాననే మనస్థాపంతో ఆమె సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న భర్త
భార్యను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలల జైలు జీవితం గడిపిన తరువాత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు.
Chittoor, Dec 9: చిత్తూరుజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త క్షణికావేశంలో చేసిన తప్పునకు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి(49), సుజాత భార్యాభర్తలు. ఇద్దరు కుమారులతో కలిసి పదేళ్ల కిందట బెంగళూరు వెళ్లి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల కిందట ఘర్షణ పడ్డారు.
గంగిరెడ్డి క్షణికావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్యను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలల జైలు జీవితం గడిపిన తరువాత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం స్వగ్రామంలో ఉన్న కుమారుల వద్దకు వచ్చాడు. రాత్రి వారితో కలిసి భోజనం చేశాడు. అనంతరం వారితో కలిసి నిద్రించాడు.
అయితే భార్యను చంపేశానని అందరూ చులకనగా చూస్తారనే మనస్థాపం చెందాడు. క్షణికావేశంలో భార్యను చంపుకొన్నానని.. తనకు బతకాలని లేదని ఆవేదన చెందాడు. ఆదివారం తెల్లవారుజామున మెలకువ వచ్చిన కుమారులకు ఇంట్లో తండ్రి కనిపించలేదు. గ్రామంలో వెతికారు. భార్య సమాధి వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించారు. మృతుడి కుమారుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటమోహన్ కేసు దర్యాప్తు చేన్నారు.