AP Police Recruitment Results: ఆంధ్ర ప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల. తమ ఘనతే అనిపించేలా ట్వీట్ చేసిన మాజీ సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో ట్రోలింగ్.

ఇప్పుడు విడుదలైన ఫలితాలు తమ ఘనతే అన్నట్లుగా ట్వీట్ చేయడం ఎంతమాత్రం సమంజసం అని నిలదీస్తున్నారు....

AP Police Constable Results & Chandrababu | Photo - Twitter

Amaravathi, September 13: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో హోంమంత్రి సుచరిత ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 2723 పోస్టులకు గానూ, 2623 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 500 మంది మహిళలు ఉన్నారు. రిజర్వేషన్ కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 100 పోస్టులు మిగిలిపోయినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

ఎంపికైన అభ్యర్థుల వివరాలను http://slprb.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే apslprb.pcsobj@gmail.com కు ఈనెల 16 లోపు మెయిల్ చేయవచ్చునని తెలిపారు. కాగా, ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తామని పోలీస్ శాఖ వెల్లడించింది.

సీఎం క్యాంపు కార్యాలయంలో పోలీస్ కానిస్టేబుళ్ల ఫలితాలను విడుదల చేసిన హోంమంత్రి:

చంద్రబాబు స్పందన

ఈ ఫలితాలపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. తేదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నేడు 2623 మంది అభ్యర్థులు ఎంపికవడం ఆనందంగా ఉందని చంద్రబాబు మరియు ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థులందరికీ చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.

ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ, ఉత్తమ ర్యాంకర్లుగా నిలిచిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఎంపికైన వారిలో 500 మంది మహిళలు ఉండటం మరింత సంతోషకర విషయంగా ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ప్రజల మన్ననలు అందుకునేలా ఉత్తమ సేవ చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

చంద్రబాబు ట్వీట్:

మరోవైపు చంద్రబాబు చేసిన ట్వీట్ పై వైసీపీ శ్రేణులు సహా, మరికొంత మంది నెటిజన్లు చంద్రబాబును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  ఐదు సంవత్సరాలుగా ఒక్క జాబ్ కూడా ఇవ్వని చంద్రబాబు. ఇప్పుడు విడుదలైన ఫలితాలు తమ ఘనతే అన్నట్లుగా ట్వీట్ చేయడం ఎంతమాత్రం సమంజసం అని నిలదీస్తున్నారు. ఈ నియామకాలు కూడా తమ ఖాతాలో వేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు చంద్రబాబు అభిమానులు మాత్రం "అప్పుడు బాబు వచ్చాడు కాబట్టే ఇప్పటికీ జాబులొస్తున్నాయి" అంటూ రీట్వీట్లు చేస్తున్నారు.