Balasore Triple Train Crash: బాలాసోర్ ఘటనపై సీబీఐ దర్యాప్తు షురూ, ఐపీసీలోని వివిధ సెక్షన్‌ల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ అధికారుల బృందం
మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి టెక్నికల్ టీంతో పాటుగా చేరుకున్న సీబీఐ అధికారులు ఐపీసీలోని వివిధ సెక్షన్‌ల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
CBI begins investigation into Odisha train accident: బాలాసోర్ రైలు ప్రమాద దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి టెక్నికల్ టీంతో పాటుగా చేరుకున్న సీబీఐ అధికారులు ఐపీసీలోని వివిధ సెక్షన్‌ల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వం సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ ఉదయం ప్రమాదం జరిగిన రైల్వే ట్రాక్, సిగ్నల్ రూమ్‌ను సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది.
ఆపై ప్రమాద స్థలికి దగ్గర్లో ఉన్న బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఆపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఒడిశా పోలీసులు ఇదివరకే ఈ ప్రమాద ఘటనపై కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యం, ప్రాణ హాని తలపెట్టడం లాంటి అభియోగాలను అందులో నమోదు చేశారు.ఇంటర్ లాకింగ్ సిస్టమ్ మార్చడమే ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించుకుంది. ఈ కోణంలోనే సీబీఐ దర్యాప్తు కొనసాగనుందని తెలుస్తోంది.
ఒడిశా రైలు ప్రమాదం, 278కి చేరుకున్న మరణాల సంఖ్య, ఇంకా గుర్తించలేని స్థితిలో 101 మృతదేహాలు
సిగ్నల్ ఫెయిలా? మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై భద్రతా కమిషన్ విచారణ కొనసాగుతోంది. మానవ తప్పిదమా? విధ్వంసమా? లేదంటే సాంకేతిక తప్పిదామా?.. సీబీఐ దర్యాప్తులో తేలాల్సి ఉంది. జూన్ 2వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన మూడు రైళ్ల ఢీ ఘోర ప్రమాదం.. 278 మంది బలిగొంది(ఇప్పటివరకు). మరో 800 మంది గాయలపాలయ్యారు.
సౌత్ ఈస్టర్న్ రైల్వే సీపీఆర్‌వో ఆదిత్య కుమార్ చౌదరి మాట్లాడుతూ ఫోరెన్సిక్, సీబీఐ బృందం సంఘటనా స్థలంలో ఉందని, సాక్ష్యాలను సేకరిస్తున్నారన్నారు. రైల్వే సీబీఐ బృందానికి సహాయం అందిస్తుందని తెలిపారు. సీబీఐ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. ఖరగ్‌పూర్, బాలాసోర్‌తో సహా పలు ప్రాంతాల్లో రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) బృందం సైతం పని చేస్తోందని, మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను ఎక్కువరోజులు కుళ్ళిపోకుండా చూడటం కష్టసాధ్యమైనదని ఢిల్లీ ఎయిమ్స్ అనాటమీ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ ఎ. షరీఫ్ అన్నారు. చాలావరకు మృతదేహాలను వారి బంధువులు గుర్తించి తీసుకుని వెళ్లగా మరికొన్నిటిని భువనేశ్వర్ ఎయిమ్స్ సహా మరికొన్ని ప్రయివేటు ఆసుపత్రులలో భద్రపరిచారు. అవన్నీ అనాధ శవాలుగా మిగిలిపోయాయి.
వీటిలో ఇంకా గుర్తు తెలియని మృతదేహాల సంఖ్య వందకు పైగా ఉంది. ఇదిలా ఉండగా ఈ మృతదేహాలను భద్రపరచడంలో ఒడిశా ప్రభుత్వం పెను సవాళ్ళను ఎదుర్కుంటోంది. ఎక్కువ రోజులపాటు మృతదేహాలు కుళ్ళిపోకుండా చూడటంలో సిబ్బందికి అనేక ఇబ్బందులెదురవుతూ ఉన్నాయి. ఈ సంఘటన జరిగి ఇప్పటికే 80 గంటలు పైబడడంతో వీటిని కుళ్లిపోకుండా చూడటం కష్టసాధ్యమైన పనేనని అన్నారు.
భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రికి ఆదివారం రోజున 139 మృతదేహాలు తీసుకుని వచ్చారు. వారి బంధువులెవరైనా వచ్చి గుర్తిస్తారని వాటిని ఐదు ఫ్రీజర్ల సాయంతో భద్రపరచి ఉంచారు. 30 గంటలు దాటిన తర్వాత నుంచి వాటిని డీకంపోజ్ కాకుండా ఉంచటానికి మరి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.