Balasore (Odisha), June 5: ఒడిశా(Odisha) బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో(Balasore) రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.కాగా బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ (Balasore) సమీపంలోని బహనాగ్ బజార్ (Bahanga Bazar) రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్‌పూర్, కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్సు రైలు ఢీకొన్న విషయం తెలిసిందే.
ఈ ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో రైలు పట్టాలు (Railway track) పూర్తిగా ధ్వంసమయ్యాయి. 288 మంది మరణించగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. రైల్వే అధికారులు, సిబ్బంది ఓవైపు సహాయక చర్యలు కొనసాగిస్తూనే.. మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. దీంతో ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే తిరిగి పట్టాలపై రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnaw) ప్రమాదం జరిగినప్పటి నుంచి ఘటనాస్థలంలోనే ఉండి పునరుద్దరణ పనులు పర్యవేక్షించారు. ప్రమాద ఘటన తర్వాత పట్టాలగుండా తొలి రైలు వెళ్తుండగా రైల్వే మంత్రి అక్కడే ఉన్నారు. పూర్తిగా ధ్వంసమైన రెండు ట్రాక్‌లను 51 గంటల్లోనే తిరిగి పునరుద్దరించారు. ఏకంగా వెయ్యిమంది కూలీలు, భారీగా యంత్రసామాగ్రిని ఉపయోగించి యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేశారు.
Videos
#WATCH | Indian Railways has started running passenger trains on the tracks which were affected due to #TrainAccident in Odisha’s Balasore pic.twitter.com/E9NTCv1ieO
— ANI (@ANI) June 5, 2023
Down-line restoration complete. First train movement in section. pic.twitter.com/cXy3jUOJQ2
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 4, 2023
ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు ట్రాక్‌లు సిద్ధంగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. పునరుద్దరించిన ట్రాక్‌పై గూడ్స్ రైలు వెళ్తుండగా తీసిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ సమయంలో రైల్వే మంత్రి ప్రార్థిస్తున్న దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్, డౌన్ రైల్వే ట్రాక్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయని రైల్వే మంత్రి చెప్పారు.
ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే ట్రాక్‌లను పునరుద్దరించాం, ఆదివారం సాయంత్రం తొలి రైలు ట్రాక్‌లపై నడిచిందని ట్వీట్ చేశారు. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం తర్వాత బాలాసోర్ రైల్వే ట్రాక్‌లపై తిరిగి కార్యకలాపాలను ప్రారంభమయ్యాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
బాహనాగ్ వద్ద పునరుద్ధరించిన పట్టాలపై ఆదివారం రాత్రి 10.40 గంటలకు తొలి గూడ్సు రైలు రాకపోకలను రైల్వే మంత్రి ప్రారంభించారు. అది విశాఖ ఓడరేవు నుంచి రూర్కెలా (Vizag to Rourkela) ఉక్కు కర్మాగారానికి బొగ్గు తీసుకెళ్తున్నది. మరికొన్ని రైళ్లను ప్రయోగాత్మకంగా పంపించి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలను ప్రారంభిస్తామని అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. వేగంగా రైల్వే లైనును పునరుద్ధరించిన సిబ్బందిని, అధికారులను ఆయన అభినందించారు.