Bangalore Bandh: శక్తి స్కీంకు వ్యతిరేకంగా బెంగుళూరు బంద్, మహిళల ఉచిత బస్సు ప్రయాణం తమ ఉపాధిపై దెబ్బపడుతోందని ప్రైవేట్ ట్యాక్సీవాలాలు ఆందోళన

కర్ణాటక ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శక్తి పథకాన్ని కేవలం ప్రభుత్వ రవాణా బస్సులకు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Bangalore Bandh (Photo-PTI)

Bengaluru, Sep 11: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి స్కీంకు వ్యతిరేకంగా బెంగళూరులో ప్రైవేట్‌ వాహనాల ఆపరేటర్లు సోమవారం బంద్‌ చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న శక్తి పథకాన్ని కేవలం ప్రభుత్వ రవాణా బస్సులకు మాత్రమే కాకుండా ప్రైవేటు బస్సులకు కూడా విస్తరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పథకంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో అనేకమార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని యూనియన్లు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల ప్రైవేట్ వాహనాలు నిలిచి పోయాయి.

అలాగే బైక్‌ ట్యాక్సీల సేవలను నిషేధించాలని కోరుతున్నారు. సోమవారం బంద్‌ చేపట్టడంతో లక్షలాది ప్రైవేట్‌ వాహనాల సేవలు నిలిచిపోయాయి.ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు ఏవీ అందుబాటులో లేవు. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు బంద్‌ను కొనసాగిస్తామని వెల్లడించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 32 ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్స్‌ ఈ బంద్‌లో పాల్గొన్నాయి.

కర్ణాటక రాజకీయల్లో అనూహ్య మలుపు, జేడీఎస్‌తో జట్టు కట్టిన బీజేపీ, నాలుగు లోక్‌సభ సీట్లు ఇచ్చేలా ఒప్పందం

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం శక్తి స్కీంను అమలుపరిచింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీని వల్ల తమ ఉపాధిపై దెబ్బపడుతోందని ప్రైవేట్ ట్యాక్సీవాలాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోని బెంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఇతర ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విన్నవించారు.

బంద్‌తో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో వీలైనన్ని అధిక బస్సులను నడుపుతున్నామని రవాణా మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 500 అధిక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు.