Bharat Bandh: భారత్ బంద్ విజయవంతం, రాత్రి ఏడుగంటలకు హోంమంత్రి అమిత్ షాతో రైతు సంఘాల భేటీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హౌస్ అరెస్ట్, పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని తెలిపిన ప్రధాని మోదీ
ప్రజలకు కొత్త సౌకర్యాలు కల్పించాలంటే సంస్కరణలు తప్పవన్నారు. భారంగా మారిన చట్టాలను వదిలించుకోవాలన్నారు.
New Delhi, December 8: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ (Bharat Bandh) విజయవంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్ కొనసాగింది. రైతులు తలపెట్టిన భారత్ బంద్‌లో 25 రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులతో పాటు ఆయా పార్టీల నాయకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలు రాష్ట్రాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే రాస్తారోకోలు, ప్రదర్శనలు నిర్వహించారు.
పంజాబ్‌లో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. అమృత్‌సర్‌లో రైతు, కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. మొహాలీలో టోల్‌ప్లాజాలను అధికారులు మూసివేశారు. ఒడిశాలోనూ ఆందోళనలు కొనసాగాయి. ఒడిశాలో వామపక్షాలు, కార్మిక, రైతు సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో నిర్వహించారు. మహారాష్ర్టలో పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. స్వాభిమాని శెట్కారి సంఘటన రైతు సంఘం ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహించారు.
బుల్ధానా జిల్లా మల్కాపూర్ రైల్వేస్టేషన్ ట్రాక్‌పై రైతులు నిరసన వ్యక్తం చేశారు. బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌లో వామపక్ష శ్రేణులు ప్రదర్శన చేపట్టాయి. కర్ణాటకలో రైతు సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి.. అగ్రి చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. మైసూర్‌లో బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. తమిళనాడులోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. అసోంలోనూ రైతులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు.
అరవింద్ కేజ్రీవాల్ హౌస్ అరెస్ట్
‘భారత్ బంద్’ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేసింది. సింఘా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి వచ్చినప్పటీ నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది.
ఈ మేరకు ఆప్ లీడర్ సౌరవ్ భరద్వాజ్ ‘ఆయనను బయటకు రానీవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరిని లోనికి అనుమతించడం లేదు. నిన్న ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారు. పని వారిని కూడా లోనికి వెళ్లనివ్వడం లేదు. ఆయన నివాసం బయట బీజేపీ నాయకులు బైఠాయించారు’ అంటూ ట్వీట్ చేశారు
సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలు మంగళవారం సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మంగళవారం నిర్వహించిన 4 గంటల ‘భారత్ బంద్’ ముగియడంతో రైతు సంఘాల నేతలు అమిత్ షాను కలిసేందుకు బయల్దేరారు. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిథి రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రైతు సంఘాల నేతలు సమావేశమవుతారని చెప్పారు. తాము బోర్డర్‌కు వెళ్తున్నామని, అక్కడి నుంచి రైతు నేతలతో కలిసి అమిత్ షాతో సమావేశానికి వెళ్తామని తెలిపారు.
నవంబరు 26 నుంచి నిరసన కార్యక్రమాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతులు నవంబరు 26 నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ చట్టాలు కార్పొరేట్ వ్యవసాయానికి పెద్ద పీట వేస్తాయని, కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కొనసాగబోదనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా రైతు సంఘాలు బుధవారం కేంద్ర మంత్రులతో 6వ రౌండ్ చర్చలు జరపబోతున్నాయి. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయడానికి బదులు కొన్ని సవరణలు చేస్తామని ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్ నుంచి వెనుకకు తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు
భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో రాస్తారోకోలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీలు నిర్వహించి.. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలు చోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించారు. రాష్ర్ట వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు.
భారత్ బంద్‌ను తమ రాష్ట్రం పాటించదు: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు డిసెంబర్ 8న తలపెట్టిన భారత్ బంద్‌ను తమ రాష్ట్రం పాటించదని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఈ చట్టాల విషయంలో రైతులలో అసంతృప్తి లేదని భావిస్తున్నానన్నారు. బంద్ పేరిట శాంతిభద్రతలకి విఘతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
ఏపీలో బంద్ విజయవంతం
భారత్ బంద్‌లో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్‌లో రైతు, కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాలు, వామపక్ష నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ పనిముట్లతో మహిళా సంఘాల నేతలు నిరసన తెలిపారు. 13 జిల్లాల్లో రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేము: ప్రధాని మోదీ
దేశ అభివృద్ధి కోసం కీలక సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గత శతాబ్దంలో అప్పటి ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొన్ని చట్టాలు దేశానికి పెద్ద భారంగా పరిణమించాయని చెప్పారు. అభివృద్ధే ధ్యేయంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నికల ఫలితాల్లోనూ అవి ప్రతిఫలిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. సోమవారం ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని తేల్చిచెప్పారు. ప్రజలకు కొత్త సౌకర్యాలు కల్పించాలంటే సంస్కరణలు తప్పవన్నారు. భారంగా మారిన చట్టాలను వదిలించుకోవాలన్నారు.