Bharat Bandh: వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతుల పోరు, కొనసాగుతున్న భారత్ బంద్, నిర్మానుష్యంగా మారిన ఢిల్లీ సరిహద్దులు, నోయిడాలో 144 సెక్షన్, పోలీసులు భారీ బందోబస్త్, బంద్‌కు మద్దతు ప్రకటించిన పలు సంఘాలు
దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్‌ఎస్, వైసీపీ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. బంద్‌లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
New Delhi, December 8: ప్రధాని మోదీ సర్కారు తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్ బంద్ (Bharat Bandh Today Latest Updates) జరుగుతోంది. దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్‌ఎస్, వైసీపీ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.
బంద్‌లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ను (Bharat Bandh) పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. రైతుల భారత్ బంద్ కు (Bharat Bandh on December 8) పలు కార్మిక సంఘాలు, రవాణ సంఘాలు, న్యాయవాద సంఘాలు మద్ధతు ప్రకటించాయి.
కోవిడ్–19 ముప్పు (Covid Scare) పొంచి ఉన్న కారణంగా, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే.మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి.
భారత్ బంద్ సందర్భంగా ఢిల్లీతోపాటు ఢిల్లీ శివార్లలోని పలు ప్రధాన రోడ్లను ముందుజాగ్రత్తగా ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఢిల్లీ శివార్లలోని సింగు, ఆచండి, పియావో మణియారి, మంగేష్, తిక్రీ, జరోడా సరిహద్దులను మూసివేసినట్లు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ లో తెలిపారు. జాతీయ రహదారి 44 ను రెండు వైపులా మూసివేశారు. ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి 24ను గాజిపూర్ సరిహద్దు వద్ద మూసివేశారు.రైతుల నిరసనలతో ఘజియాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే రోడ్డును మూసివేశారు. నోయిడాలో ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను విధించారు.
Here's Some States Bharat Bandh Visuals
రైతులు రోడ్లు, రైలుపట్టాలపై బైఠాయించడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాగరాజ్ నగరంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. జైపూర్ నగరంలో రైతులు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద ఘెరావ్ చేశారు. బంద్ సందర్భంగా ఎవరైనా 3 గంటలపాటు ఇరుక్కుపోతే వారికి మంచినీరు, పండ్లను ఇస్తామని, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు.
బనారస్ నుంచి గ్వాలియర్ వెళ్లాల్సిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రయాగరాజ్ నగరంలో కార్యకర్తలు ఆపివేశారు. భారత్ బంద్ సందర్భంగా భువనేశ్వర్ రైల్వే స్టేషనులో రైళ్లను రైతులు నిలిపివేశారు. రవాణ సంఘాలు బంద్ కు మద్ధతు ప్రకటించడంతో సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపించింది. పూణే మార్కెటును తెరిచినా రైతుల బంద్ కు తాము మద్ధతు ఇస్తున్నామని వ్యాపారులు చెప్పారు.
వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
మేం పిలుపునిచ్చిన బంద్ రాజకీయ పార్టీలిచ్చే బంద్ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్ తికాయిత్ వివరించారు.ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు.
బంద్‌కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) ప్రకటించింది. ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్’ కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేశాయి.
బంద్‌లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్ యూనియన్లు తెలిపాయి. బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్‌కు మద్దతుగా బ్యాంక్ బ్రాంచ్‌ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది.ఇక రవాణ సంఘాలు బంద్ కు మద్ధతు ప్రకటించడంతో సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపించింది. పూణే మార్కెటును తెరిచినా రైతుల బంద్ కు తాము మద్ధతు ఇస్తున్నామని వ్యాపారులు చెప్పారు.
రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు.
కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ బృందం తోమర్‌ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్ యూనియన్(అత్తార్) జాతీయ అధ్యక్షుడు అత్తార్ సింగ్ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్ వ్యాఖ్యానించారు.
బంద్ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్‌లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్ మేనేజర్లకు సూచించారు.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్ధతుగా డిసెంబరు 9వతేదీన తన పుట్టినరోజును జరుపుకోకూడదని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించారు. రైతుల ఆందోళనలు, కరోనా వ్యాప్తి కారణంగా తాను జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కార్యకర్తలు, అభిమానులకు సోనియా సూచించారు.