Bihar: హిందూ దేవాలయానికి రూ.2.5 కోట్లు విరాళం ఇచ్చిన ముస్లిం కుటుంబం, విరాట్ రామాయణ్ మందిర్ నిర్మాణం కోసం భూమిని దానం చేసిన వ్యాపారవేత్త అహ్మద్ ఖాన్
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించేందుకు ఓ ముస్లిం కుటుంబం భూమిని విరాళంగా అందించిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా కైత్వాలియా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది
Patna, Mar 22: బీహార్ రాష్ట్రంలో మతసామరస్యం వెల్లివిరిసింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించేందుకు ఓ ముస్లిం కుటుంబం భూమిని విరాళంగా అందించిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా కైత్వాలియా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. కైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం (World's Largest Temple) విరాట్ రామాయణ్ మందిర్ నిర్మాణానికి రూ.2.5 కోట్ల విలువైన స్థలాన్ని (Muslim Family Donates Rs 2.5 Crore Land) ఓ ముస్లిం కుటుంబం విరాళంగా ఇచ్చింది.
తాము నిర్మించే ఆలయానికి రూ.2.5కోట్ల విలువైన భూమిని గౌహతిలోని వ్యాపారవేత్త ఇష్తయాక్ అహ్మద్ ఖాన్ విరాళంగా ఇచ్చారని ఆలయ నిర్మాణం చేపట్టిన మహావీర్ మందిర్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య కిషోర్ కునాల్ వెల్లడించారు. కేషారియా సబ్ డివిజన్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ఆలయ నిర్మాణం కోసం అహ్మద్ ఖాన్ కుటుంబానికి చెందిన భూమిని విరాళంగా ఇస్తూ రిజిస్ట్రేషన్ చేశారని ఐపీఎస్ మాజీ అధికారి అయిన ట్రస్ట్ చీఫ్ కిషోర్ చెప్పారు. అహ్మద్ ఖాన్ కుటుంబం విరాళం అందించడంతో రెండు వర్గాల మధ్య సామాజిక సామరస్యం, సోదరభావం ఏర్పడిందని కిషోర్ చెప్పారు. ముస్లిం కుటుంబం సహాయం లేకుండా తాము ఆలయ నిర్మాణం కల సాకారం అయ్యేది కాదని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆలయ నిర్మాణం కోసం మహావీర్ మందిర్ ట్రస్ట్ ఇప్పటివరకు 125 ఎకరాల భూమిని పొందింది. ఈ ప్రాంతంలో ట్రస్టు త్వరలో మరో 25 ఎకరాల భూమిని కూడా పొందనుంది. విరాట్ రామాయణ మందిరం కంబోడియాలోని 12వ శతాబ్దపు ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంగ్కోర్ వాట్ కాంప్లెక్స్ కంటే 215 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. తూర్పు చంపారన్‌లోని కాంప్లెక్స్ ఎత్తైన గోపురాలతో 18 ఆలయాలుంటాయి. ఈ ఆలయంలో శివాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ఉంటుంది.ఈ ఆలయ నిర్మాణ వ్యయం సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. న్యూఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో నిమగ్నమైన నిపుణుల నుంచి ఆలయ ట్రస్ట్ త్వరలో సలహాలు తీసుకోనుంది.