Bird Flu: పది రాష్ట్రాలకు డేంజర్ బెల్స్, కల్లోలం రేపుతున్న బర్డ్‌ ఫ్లూ, వేల సంఖ్యలో పక్షుల మరణాలు, బర్డ్‌ఫ్లూని తేలిగ్గా తీసుకోవద్దని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ప్రధాని మోదీ

ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందినట్టు (Bird flu outbreak confirmed in 10 states) కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ (Bird flu outbreak) నిర్ధారణ కాగా, సోమవారం ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోనూ ఈ వ్యాధిని గుర్తించారు.

Bird Flu Outbreak(Photo Credits: Pixabay)

New Delhi, Jan 12: బర్డ్‌ ఫ్లూ మహమ్మారి దేశంలో కల్లోలం రేపుతోంది. ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందినట్టు (Bird flu outbreak confirmed in 10 states) కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ (Bird flu outbreak) నిర్ధారణ కాగా, సోమవారం ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోనూ ఈ వ్యాధిని గుర్తించారు. రాజస్తాన్‌లోని టోంక్, కరౌలి, భిల్వారా, గుజరాత్‌లోని వల్సాద్, వడోదర, సూరత్‌ జిల్లాల్లో కాకులు, వలస పక్షులు, అడవి పక్షులు బర్డ్‌ ఫ్లూతో మరణించినట్లు కేంద్రం నిర్ధారించింది. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్, డెహ్రాడూన్‌ జిల్లాల్లో కూడా కాకులు మరణించినట్లు తెలిపింది. తూర్పు ఢిల్లీలోని సంజయ్‌ లేక్‌ ప్రాంతంలో కాకులు, బాతుల మరణానికి బర్డ్‌ఫ్లూ కారణమని తేల్చింది.

మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. దీంతో 8-10వేల పక్షులను వధించాలని నిర్ణయించారు. అలాగే ముంబై, థానే, దపోలి, బీడ్‌ ప్రాంతాల్లోనూ బర్డ్‌ ఫ్లూ కేసులు వెలుగు చూసినట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో గడిచిన వారం రోజుల్లో అంజిరెడ్డికి చెందిన 350, రాజుకు చెందిన 30 కోళ్లు చనిపోయాయి. సోమవారం వారికి చెందినవే 15కోళ్లు మృత్యువాత పడ్డాయి. పశువైద్యాధికారులు మాత్రం జిల్లాలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని చెబుతున్నారు. మరోవైపు.. బర్డ్‌ఫ్లూని తేలిగ్గా తీసుకోవద్దని.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని.. నిరంతర పర్యవేక్షణ ఉంచాలని ప్రధాని మోదీ సూచించారు.

పక్షుల నుంచి మనుషులకు బర్డ్‌ఫ్లూ వైరస్‌, పక్షుల లాలాజలం, వ్యర్ధాల ద్వారా మనషులకు వ్యాప్తి చెందే అవకాశం, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న సైంటిస్టులు

రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలలో మరో 371 పక్షులు మృతి చెందాయి. అలాగే రాష్ట్రంలోని 15 జిల్లాలను బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ విషయమై పశుసంవర్థకశాఖ అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా మరో 371 పక్షులు మృతి చెందాయని, దీనితో రాష్ట్రంలో మొత్తంగా మృతి చెందిన పక్షుల సంఖ్య 3,321కి చేరిందన్నారు. సోమవారం ఉదయం జైపూర్ జంతు ప్రదర్శనశాలలో మూడు బాతులు మృతి చెందాయన్నారు. ఇదేవిధంగా సీకర్, భీల్వాడా, చూరూ నుంచి సేకరించిన పక్షుల నమూనాలో నాలుగు నమూనాలు నెగిటివ్ వచ్చాయన్నారు. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 235 నమూనాలను పరీక్షలకు పంపామన్నారు.

తొమ్మిది రాష్ట్రాల్లో హై అలర్ట్, వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత, మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు రెడీ అవుతున్న బర్డ్ ఫ్లూ, అన్ని రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాలని కోరిన కేంద్రం

బర్డ్‌ ఫ్లూపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడాన్ని నిరోధించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. నీటి వనరులు, పక్షుల మార్కెట్లు, జంతు ప్రదర్శనశాలలు, పౌల్ట్రీ ఫామ్‌ల చుట్టూ నిఘా పెంచాలని, మరణించిన పక్షులను పారవేయడంలో సరైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. దేశంలో బర్డ్‌ఫ్లూ కేసులు ఉన్నప్పటికీ పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని, మార్కెట్లను మూసివేయొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సోమవారం అన్ని రాష్ట్రాలకు సూచించారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి పక్షులు, పశువుల నుంచి మనుషులకు సోకుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుచేశారు.