Electoral Bonds Data: ఎలక్ట్రోరల్ బాండ్స్ మరో లిస్ట్ రిలీజ్, అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీగా బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలకు ఎన్నికోట్ల విరాళాలు వచ్చాయో తెలుసా?
అయితే ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమాచారంలో ఎస్‌బీఐ పూర్తి సమాచారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
New Delhi, March 17: ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం రెండో జాబితాను (Electoral Bonds Data) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సమర్పించిన డేటాను మరోసారి అందుబాటులో ఉంచినట్లు ఆదివారం ఎన్నికల సంఘం (Electoral Bonds Data) వెల్లడించింది. సీల్డ్ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ (BJP) పార్టీ అత్యధికంగా రూ.6,986.50 కోట్ల విరాళాలను పొందినట్లు తెలిపింది. కేవలం 2019-2020 మధ్య బీజేపీకి రూ.2,555 కోట్ల బాండ్లు అందినట్లు ఈసీ విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది. ఇక.. బీజేపీ పార్టీ తర్వాత అత్యధికంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి రూ.1,397కోట్ల విలువైన బాండ్లను విరాళాలుగా పొందినట్లు తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ- రూ.1334 కోట్లు
బీఆర్‌ఎస్- రూ. 1322 కోట్లు
బిజు జనతాదళ్- రూ.944 కోట్లు
డీఎంకే - రూ. 656.5 కోట్లు (ఇందులో రూ. 509 కోట్లు లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ నుంచి వచ్చాయి)
వైఎస్సార్‌సీపీ- రూ.442.8 కోట్లు
టీడీపీ- రూ.182. 35 కోట్లు
సమాజ్‌వాదీ పార్టీ- రూ. 14.5 కోట్లు
అకాలీదళ్- రూ.7.26 కోట్లు
ఏఐఏడీఎంకే- రూ.6.05 కోట్లు
నేషనల్ కాన్ఫరెన్స్- రూ. 50 లక్షలు
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్లకు (Electoral Bonds Data) సంబంధించి మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమాచారంలో ఎస్‌బీఐ పూర్తి సమాచారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఎందుకు లేవో చెప్పాలని మార్చి 15 నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలు వెల్లడించకపోవటంపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎస్‌బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.