BJP MLA Saves 3 Youths: వీడియో ఇదిగో, సముద్రంలోకి దూకి ముగ్గురి ప్రాణాలు కాపాడిన బీజేపీ ఎమ్మెల్యే, రియల్ హీరో అంటూ గుజరాత్ ఎమ్మెల్యే హీరా సోలంకిపై సర్వత్రా ప్రశంసలు
ఓ పడవలో వచ్చిన కొందరు వ్యక్తులు కూడా దీనికి సహకరించడంతో ముగ్గురు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Gandhi Nagar, June 1: గుజరాత్‌లోని రాజుల నియోజకవర్గం ఎమ్మెల్యే, బీజేపీ (BJP) నేత హీరా సోలంకి (Hira Solanki) ముగ్గురు యువకుల ప్రాణాలను కాపాడారు. ఓ పడవలో వచ్చిన కొందరు వ్యక్తులు కూడా దీనికి సహకరించడంతో ముగ్గురు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బుధవారం పట్వా గ్రామం సమీపంలో జరిగింది.
గుజరాత్ అమ్రేలి జిల్లాలో పట్వా గ్రామ సమీపంలోని సముద్ర తీరానికి బుధవారం మధ్యాహ్నం నలుగురు యువకులు ఈతలకు వెళ్లారు. అయితే వాతావరణంలోని మార్పులతో అలలు పోటెత్తాయి. దీంతో వాళ్లు మునిగిపోసాగారు. ఈలోపు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అయితే ఆ సమయంలో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి మాత్రం ఆలస్యం చేయలేదు.
అలలతో పోటెత్తిన సముద్రానికి ఎదురీదుతూ యువకులను రక్షించేందుకు సముద్రంలోకి దూకారు. ఈలోపు కొందరు యువకులు ఆయనకు సాయానికి రాగా.. బోట్ సాయంతో సముద్రంలోకి వెళ్లారు. స్వయంగా నీళ్లలో దూకి ముగ్గురు యువకులను రక్షించారు. మరో యువకుడు అలల ధాటికి కొట్టుకునిపోగా.. సాయంత్రానికి మృతదేహం దొరికింది.
Video
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు హీరా సోలంకి. ఆలస్యం చేయకుండా సాహసం ప్రదర్శించి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన ఎమ్మెల్యేపై రియల్ హీరో అంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.