Anti-CAB Protests: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అట్టుడుకుతున్న అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాలు, రైల్వే స్టేషన్లకు నిప్పు, సైన్యాన్ని మోహరించిన కేంద్రం, ఆందోళన చెందవద్దని ప్రధాని మోదీ హామి

పౌరసత్వ సవరణ చట్టంపై అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని తెలిపారు....

Army troopers in Assam | File Image | (Photo Credits: PTI)

Guwahati, December 12: పౌరసత్వ సవరణ బిల్లు 2019 (Citizenship Amendment Bill/ CAB 2019) ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటి నుండి అస్సాం (Assam) మరియు దాని చుట్టుపక్క రాష్ట్రాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిమేతర శరణార్థులను చట్టబద్ధం చేసే క్యాబ్ (CAB) చట్టం బుధవారం రాజ్యసభలోనూ ఆమోదం పొందడంతో నిరసనకారుల ఆగ్రహా జ్వాలలు తారాస్థాయికి చేరాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను, నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా నిరసనకారులు తమ ఆందోళనలను (Protests) ఉధృతం చేశారు. అస్సాం రాజధాని గువహటిలో నిరసనకారులు ఆస్తుల విధ్వంసం మరియు భద్రతాదళాలపై రాళ్లు విసరడం లాంటి చర్యలకు పాల్పడ్డారు.

అంతేకాకు గత రాత్రి చాబువా మరియు పానిటోలా రైల్వేస్టేషన్లకు నిప్పుపెట్టడమే కాకుండా, అస్సాం సీఎం ఇంటిపై రాళ్లు రువ్వారు. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల నివాసాలే లక్ష్యంగా బుధవారం అర్ధరాత్రి 3 గంటలకు అందోళనకారులు విధ్వంసాలకు పాల్పడ్డారు.

పరిస్థితులు చేయి దాటేలా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం గురువారం ఆర్మీని రంగంలోకి దించింది. సున్నితమైన ప్రాంతాల్లో 5 ట్రూపుల ఆర్మీ బృందాలను, సుమారు 750 మంది సైనికులను మోహరించింది.

 

ఈశాన్య రాష్ట్రాల్లో క్యాబ్ కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు గల కారణాలేమి?

 

ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడానికే ఈ క్యాబ్ చట్టం అని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం ఇది మతప్రాతిపాదికన చేసిన చట్టం అంటూ దీనిని వ్యతిరేకించాయి. అయితే ఈశాన్య రాష్ట్రాలు ఈ క్యాబ్ చట్టాన్ని వ్యతిరేకించడానికి గల కారణాలు వేరేగా ఉన్నాయి. ఈ చట్టం ఒక్క మతపరమైన అంశంతో కూడుకున్నది కాదని, ఈ చట్టంలోని క్లాజులు ఈశాన్య రాష్ట్రాల ప్రజల గుర్తింపు, తమ సంస్కృతి, తమ భాష మరియు ఉనికినే హరించివేసేలా ఉందని ఆరోపిస్తున్నారు.

పౌరసత్వ సవరణ చట్టం, అస్సాం ఒప్పందం ((Assam Accord)) నిబంధనలకు విరుద్ధంగా ఉందని ముఖ్యంగా "క్లాజ్ 6" (Clause 6) ను ఉల్లంఘిస్తుందని ఈ అందోళనలకు నాయకత్వం వహిస్తున్న నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ యూనియన్ (NESO) మరియు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU)లు ఆరోపిస్తున్నాయి.

1984లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం AASU తో కొన్ని వారాల చర్చల అనంతరం క్లాజ్ 6ను అస్సాం ఒప్పందంలో చేర్చారు. ఈ ఒప్పందంలో కీలకమైన నిబంధన స్థానిక ప్రజల సాంస్కృతిక, సామాజిక, భాషా గుర్తింపు మరియు వారసత్వ రక్షణకు రాజ్యాంగ, శాసన మరియు పరిపాలనా భద్రతలు అందించబడతాయి. కాగా, తాజాగా రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లులో ఈ క్లాజ్ 6ను తొలగించారని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు నిరసనబాట పట్టారు.

మీ హక్కులను ఎవ్వరూ హరించలేరు, సంయమనం పాటించండి: ప్రధాని మోదీ

 

అస్సాంలో తీవ్రస్థాయిలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని తెలిపారు. ఈ చట్టం ఎవరి హక్కులను హరించవేయదని అందుకు తాను హామి ఇస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాల మాయలో పడొద్దని సూచించారు.

"అస్సాంలోని నా సోదరులు మరియు సోదరీమణులు CAB పార్లమెంట్ ఆమోదం పొందినందుకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను భరోసా ఇస్తున్నాను. మీ హక్కులు, ప్రత్యేకమైన గుర్తింపు మరియు అందమైన సంస్కృతిని ఎవరూ హరించలేరు. అవి కలకాలం వృద్ధి చెందుతూనే ఉంటాయి" అంటూ మోదీ ట్వీట్ చేశారు.



సంబంధిత వార్తలు