Cardless Cash Withdrawals: కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన, వివరాలను వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని (Cardless Cash Withdrawals) కల్పించనున్నది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో నగదు తీసుకునే ఏర్పాటు చేయనున్నారు.
Mumbai, April 8: ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష (Monetary Policy Review) జరిగింది. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కీలకమైన వడ్డీ (రెపో, రివర్స్ రెపో) రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పెంచుతుందని అంతా భావించారు. కానీ, ఆర్బీఐ మాత్రం ఇటు పెంచడంగానీ, తగ్గించడంగానీ చేయలేదు. పాత రేట్లనే యథాతథంగా ఉంచేసింది. దాని వల్ల రుణాలు తీసుకునేవారిపై పెద్దగా ప్రభావమేమీ పడకపోయినా.. ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు మాత్రం మింగుడుపడని విషయమే.రెపోరేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్దే ఆర్బీఐ స్థిరంగా ఉంచింది.
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని (Cardless Cash Withdrawals) కల్పించనున్నది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో నగదు తీసుకునే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కార్డ్‌లెస్ విత్‌డ్రాలను కొన్ని బ్యాంకులు మాత్రమే కల్పిస్తున్నాయని, అయితే అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్స్‌లో కార్డ్‌లెస్ విత్‌డ్రా అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.
2022-23 సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య పరపతి విధాన ప్రకటనను ఆయన ప్రకటించారు. కార్డ్ లెస్ విత్‌డ్రా ద్వానా వినియోగదారుడు తన వద్ద బెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ లాంటి చర్యలను కూడా అడ్డుకోవచ్చు అని ఆయన అన్నారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల జారీని ఆపేది లేదని ఆర్బీఐ గరవ్నర్ తెలిపారు. ఆ కార్డులను కేవలం క్యాష్ విత్‌డ్రాల కోసమే కాదు అని, వాటిని రెస్టారెంట్లు, షాపులు, విదేశీ టూర్ల సమయంలో వాడుకునే వీలుందన్నారు. ఆ కార్డులను ఎప్పటికీ కంటిన్యూ చేస్తామన్నారు.