Next Chief Justice Of India: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా, ప్రతిపాదించిన సీజేఐ డీవై చంద్రచూడ్, ఇంతకీ ఎవరీ సంజీవ్ ఖన్నా?
ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై. చంద్రచూడ్ (CJI DY Chandrachud) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకి లేఖ రాశారు. లేఖలో సంజీవ్ ఖన్నా పేరును తదుపరి సుప్రీం కోర్టు సీజేఐగా (Next Chief Justice Of India) ప్రతిపాదించారు.
New Delhi, OCT 17: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) పేరును కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై. చంద్రచూడ్ (CJI DY Chandrachud) కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకి లేఖ రాశారు. లేఖలో సంజీవ్ ఖన్నా పేరును తదుపరి సుప్రీం కోర్టు సీజేఐగా (Next Chief Justice Of India) ప్రతిపాదించారు. ఇక.. నవంబర్ 10వ తేదీన సీజేఐ చంద్రచూడ్ పదవీకాలం ముగియనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తర్వాత సుప్రీంకోర్టులో రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా. భారత ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన అనంతరం సంప్రదాయం ప్రకారం రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని వారసుడిగా తదుపరి సీజేఐగా నామినేట్ చేస్తారు. సీజేఐ చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి.
CJI DY Chandrachud has formally proposed Justice Sanjiv Khanna as his successor
జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 9, 2022న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. సీజేఐగా ఆయన పదవీకాలం నవంబర్ 10తో ముగుస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. తీస్ హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టులలో ప్రాక్టీస్ చేశారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు, ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ కొనసాగించారు. ఖన్నా ఆదాయపు పన్ను శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు.2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సెల్ (సివిల్)అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ కేసుల్లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ , అమికస్ క్యూరీగా పనిచేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తి , 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జనవరి 18, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ గవర్నింగ్ కౌన్సెల్ సభ్యుడుగా ఉన్నారు. ఆయన భాగమైన సుప్రీం ధర్మాసనం.. వివాదాస్పద సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను నిర్మాణాన్ని ఆమోదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన, ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన రాజ్యాంగ ధర్మాసనాల్లో సంజీవ్ ఖన్నా ఉన్నారు.