ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్‌ఆర్)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ను 8.20 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 8.45 శాతంగా ఉండేది. మంగళవారం నుంచే కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఆయా రుణాలను తీసుకున్న ఎస్బీఐ కస్టమర్లకు లాభించనున్నది.
బ్యాంకులు ఈ ఎంసీఎల్‌ఆర్ కంటే తక్కువ వడ్డీరేటుకు రుణాలను ఇవ్వకూడదు. ప్రస్తుతం ఓవర్‌నైట్ దగ్గర్నుంచి మూడేండ్లదాకా రకరకాల ఎంసీఎల్‌ఆర్‌లు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎస్బీఐ మార్చింది నెల రోజుల ఎంసీఎల్‌ఆర్‌నే. మిగతా వాటిలో ఏ మార్పూ లేదు. ఎంసీఎల్‌ఆర్ పెరిగితే లోన్ల ఈఎంఐల భారం కూడా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అలాగే తగ్గితే రుణ వాయిదా చెల్లింపులూ తగ్గుతాయి.
కాగా, ఎస్బీఐ బేస్ రేటు 10.40 శాతంగా ఉన్నది. బీపీఎల్‌ఆర్ 15.15 శాతం. ఇవి సెప్టెంబర్ 15 నుంచి అమల్లో ఉన్నాయి. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్‌ఆర్) 9.15 శాతంగా ఉన్నది.