Relief for Private Teachers: ప్రైవేట్ టీచర్లకు రూ. 2 వేల ఆపత్కాల భృతి, కుటుంబానికి 25 కేజీల బియ్యం, కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ నిర్ణయం
2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
Hyderabad, April 9: కరోనా నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరనుంది.
కోవిడ్ వ్యాప్తి కారణంగా ఎన్నో రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఇందులో కార్పోరేట్ విద్యాసంస్థల పరిస్థితి పక్కన పెడితే సాధారణ ప్రైవేట్ విద్యాసంస్థలు దారుణంగా నష్టపోయాయి. ముఖ్యంగా టీచర్లు, ఇతర సిబ్బంది పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కొంతమందైతే ఉపాధి కోల్పోయిన దొరికిన పనిచేసుకుంటూ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇంకొంతమందైతే కుటుంబాన్ని పోషించలేక, ఏదో ఒక పనిచేసుకుంటూ తమ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టలేక ఆత్మహత్యలు సైతం చేసుకుకున్నారు. తెలంగాణలో ఇటీవల స్కూళ్లు తెరిచినప్పటికీ విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో తిరిగి స్కూళ్లను మూయాల్సి వచ్చింది. దీంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ల సిబ్బంది ర్యాలీలు చేపట్టారు, తమను ఆదుకోవాలంటూ రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో మానవతాకోణంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆపత్కాల భృతిని అందించేందుకు ముందుకు వచ్చింది. కష్టకాలంలో ఉన్న ప్రైవేట్ టీచర్లకు సీఎం కేసీఆర్ నిర్ణయంతో కొంత ఊరట లభించినట్లయింది.