CM KCR Review Details: షరతులు వర్తిస్తాయి? హైకోర్ట్ తుది తీర్పు తర్వాతే నిర్ణయం, ఆర్టీసీపై ఎలాంటి ప్రకటన చేయని సీఎం కేసీఆర్, ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశం తేలిన తర్వాతే కార్మికులపై తుది నిర్ణయం
ఇప్పటికే చాలా మంది కార్మికులు డిపోల వద్ద చేరుకొని సీఎం ప్రకటన కోసం ఎదురుచూశారు. విధుల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆర్టీసీ జేఏసీ చెప్పిన షరతులు లేని అనుమతి కావాలంటే, ప్రభుత్వం ముందుగా ప్రతిపాదించిన
Hyderabad, November 21: గురువారం సాయంత్రం నుంచి దాదాపు 5 గంటలుగా సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశం (CM KCR Review) ముగిసింది. సీఎం ప్రకటన కోసం ఆర్టీసీ కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూశారు, అటు కార్మిక సంఘాలు సమావేశం (TSRTC Unions) ఏర్పరుచుకున్నాయి. అయితే సమావేశం ముగిసిన తర్వాత సీఎం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. రేపు శుక్రవారం ఆర్టీసీ ప్రైవేటీకరణ (TSRTC Privatization) అంశం హైకోర్టులో విచారణకు రానుంది. దీనిపై హైకోర్టులో తుది తీర్పు వెలువడిన తర్వాతనే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.
సీఎం కేసీఆర్ ముందు నుంచి చెప్తున్నట్లుగా, ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ ఆర్థిక స్థితి దృష్ట్యా యధావిధిగా కొనసాగించడం జరగని పని, ఆర్టీసీకి ప్రస్తుతం రూ, 5 వేల కోట్ల అప్పులు, తక్షణం చెల్లించాల్సినవి రూ. 2 వేల కోట్లు, కార్మికుల సెప్టెంబర్ జీతాల కోసం చెల్లించాల్సినవి రూ. 240 కోట్లు, సీసీఎస్ బకాయిలు రూ. 500 కోట్లు, పీఎఫ్ బకాయిలు సుమారు రూ. 70 కోట్లు, ఇలా ఇప్పటికిప్పుడు ఆర్టీసీని నడిపించాలంటే రూ. 640 కోట్లు అవసరం. అవి కావాలంటే బస్సు ఛార్జీలు పెంచటం ఒక్కటే మార్గం, కానీ బస్ ఛార్జీలు పెంచితే ప్రజలు భరించలేరు. ఈ నేపథ్యంలో యధావిధిగా ఆర్టీసీ కొనసాగించడం కుదరదు. ముందుగా ప్రతిపాదించినట్లుగా రూట్ల ప్రైవేటీకరణకు ఇస్తే భారం తగ్గుతుంది. కాబట్టి ఆ అంశంలో హైకోర్ట్ చిక్కుముడి వీడిన తర్వాతే కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం నిర్ణయించినట్లుగా సమాచారం.
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ జేఏసీ- ప్రొ. కోదండరాం నేతృత్వంలోని తెజస పార్టీ నేత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది కూడా దాదాపు గత నెలరోజులుగా హైకోర్టులో వాయిదాల మీదే నడుస్తుంది. శుక్రవారం దీనిపై హైకోర్ట్ నిర్ణయాన్ని ప్రకటిస్తే, దాని ఆధారంగానే టీఎస్ ఆర్టీసీ భవితవ్యం తేల్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు.
ఇక సీఎం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురుచూసిన కార్మికులకు ఈరోజుకైతే నిరాశే మిగిలింది. ఇప్పటికే చాలా మంది కార్మికులు డిపోల వద్ద చేరుకొని సీఎం ప్రకటన కోసం ఎదురుచూశారు. విధుల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆర్టీసీ జేఏసీ చెప్పిన షరతులు లేని అనుమతి కావాలంటే, ప్రభుత్వం ముందుగా ప్రతిపాదించిన 50:50 నిష్పత్తిలో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యానికి ఆర్టీసీ కార్మికులు
అనుకూలంగా ఉంటేనే వారి ప్రతిపాదనలను పరిశీలించాలనే విధంగా ప్రభుత్వం ఆలోచన ఉన్నట్లుగా అర్థమవుతుంది.