TSRTC Row: సీఎం నిర్ణయం వెలువడక ముందే బస్ డిపోలకు పోటెత్తుతున్న ఆర్టీసీ కార్మికులు, కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం
TSRTC Strike | KCR Review | Representational Image | File Photo

Hyderabad, November 21: ఆర్టీసీ జేఏసీ  (TSRTC JAC) చేసిన సమ్మె విరమణ ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్  ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం (CM KCR Review) నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, అడ్వొకేట్ జనరల్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రకటన కోసం కార్మికులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు, సీఎం నిర్ణయం వెలువడక ముందే పలుచోట్ల డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు చేరుకుంటున్నారు. తమను విధుల్లో చేర్చుకోవాల్సిందిగా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ సూచన మేరకు తాము ఇప్పటికే సమ్మె విరమించినట్లుగా చెబుతున్నారు.  తెలంగాణ ఆర్టీసీ జేఏసీ భవిష్యత్తా..లేక భవిష్యత్ కార్యాచరణనా? 

ఉప్పల్ డిపో వద్దకు 300 ఆర్టీసీ కార్మికులు వచ్చారు, మహేశ్వరం డిపోవద్దకు 60 మంది చేరుకున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల వందలాది ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట క్యూ కట్టారు. సీఎం ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రకటన వెలువడగానే డ్యూటీ ఛార్జీలపై సంతకాలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

కాగా, తాజా పరిణామాలపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. అంతకుముందు ఎండీ సునీల్ శర్మ కూడా విడిగా ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని అధికారుల సునీల్ శర్మ అభిప్రాయాలను తీసుకున్నారు. ఆ విషయాలను సీఎం కేసీఆర్ సమీక్షలో చర్చకు తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది.