TSRTC Strike | CM KCR Review | File Photo

Hyderabad, November 21: ఆర్టీసీ (TSRTC) పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (CM KCR)  గురువారం సాయంత్రం కీలకమైన సమీక్ష సమావేశం (Review Meeting)  ఏర్పాటు చేశారు. నెలన్నర రోజులుగా సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులు నిన్న సాయంత్రం సమ్మె (RTC Strike) విరమించేందుకు సిద్ధమే అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎలాంటి షరతులు లేకుండా, కార్మికుల ఆత్మ గౌరవం దెబ్బతినకుండా సమ్మె ప్రారంభానికి ముందున్న వాతావరణాన్ని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమన్యం కల్పిస్తే తాము విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఈనేపథ్యంలో దీనిపై సీఎం కేసీఆర్ స్పందన ఎలా ఉండబోతుందోననే విషయంపై ఉత్కంఠత నెలకొంది.

తమ డిమాండ్లన్నీ పక్కన పెట్టేసి, 47రోజుల సుదీర్ఘ సమ్మెలో ఎలాంటి ఫలితం లేకుండానే ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసింది.

ఇక ప్రభుత్వ స్పందన కోసం కార్మికులు ఎదురు చూస్తుండగా, ఈరోజు సాయంత్రం సీఎం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, అడ్వొకేట్ జనరల్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు సమాచారం. తాజా పరిణామాలతో పాటు హైకోర్ట్ ఆదేశాలు, రూట్ల ప్రైవేటీకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అయితే ప్రధానంగా, ఆర్టీసీ కార్మికుల పట్ల ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై చర్చించనున్నారు. గతంలో రెండు సార్లు అవకాశం ఇచ్చినా, కార్మికులు బేఖాతరు చేశారు. ఇప్పుడే తామే స్వయంగా విధుల్లో చేరుతాం అని కోరుతున్నారు. అయితే ఎలాంటి షరతులు లేకుండా అనే నిబంధన పెట్టారు. ప్రభుత్వం వారిని తిరిగి విధుల్లో చేర్చుకునే అవకాశమే ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎలాంటి షరతులు లేకుండా తీసుకునేందుకు అంగీకరిస్తుందా అనేది ప్రశ్న. ఆర్టీసీ యూనియన్ల వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు భావిస్తున్న కేసీఆర్, ఇకపై భవిష్యత్తులో ఎలాంటి యూనియన్లు లేకుండా చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.  సీఎం నిర్ణయం వెలువడక ముందే బస్ డిపోలకు పోటెత్తుతున్న ఆర్టీసీ కార్మికులు

అలాగే రెండున్నర నెలలుగా ఆర్టీసీ కార్మికులు జీతాలు లేకుండా గడిపారు. మరి ప్రభుత్వం వద్దన్నా చేపట్టిన ఈ సమ్మె కాలానికి జీతాలు చెల్లించాలా? వద్దా అనే అంశంపై కూడా చర్చ జరగవచ్చు. ఇక కార్మికులపై వారిపై చర్యలు, తదితర అంశాలు ఒకవేళ లేబర్ కోర్టుకు కేసు బదలాయిస్తే, కోర్టు నిర్ణయానికే వదిలివేసే అవకాశం ఉండవచ్చు.

ఇప్పటికైతే ఇవన్నీ ఊహాగానాలకే పరిమితం చేసుకోవాలి, సాయంత్రం కేసీఆర్ సమావేశం తర్వాత నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఆయన నిర్ణయంపైనే ఆర్టీసీ జేఏసీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సీఎం స్పందన ఆధారంగానే ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది.