Telangana RTC Strike - Big News: ఆర్టీసీ సమ్మె విరమణకు సిద్ధం, కార్మికుల ఆత్మ గౌరవం దెబ్బతీయొద్దు, ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలి
File Image of TS RTC JAC leader Ashwatthama Reddy.

Hyderabad, November 20:  ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. కార్మికుల ఆత్మగౌరవం కించపరచకుండా, ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి చేర్చుకునేందుకు అంగీకరిస్తే, తాము సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) బుధవారం ప్రకటించారు.

అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ, సమ్మె ప్రారంభానికి ముందు అంటే అక్టోబర్ 04 ముందు వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోరారు.  ప్రజలు, ఆర్టీసీ సంస్థ కార్మికుల పరిస్థితుల దృష్ట్యా సమ్మె విరమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఈమేరకు ప్రభుత్వం, యాజమాన్యం నుంచి ఆహ్వానం అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం, యాజమాన్యం కోర్టు తీర్పును గౌరవించి నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. అయితే ప్రభుత్వం స్పందించకపోతే యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.

లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని అశ్వత్థామ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మెలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను జేఏసీ ఆదుకుంటుందని ఈ సందర్భంగా మరోసారి వెల్లడించారు.

సమ్మె విరమణపై ఆర్టీసీ జేఏసీ విడుదల చేసిన పత్రికా  ప్రకటన

 

అంతకుముందు తెలంగాణ ఆర్టీసీ ఐకాస (TSRTC JAC) నేతలు ఇమ్లిబన్ బస్ స్టేషన్ లో బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వారు చేస్తున్న సమ్మె పట్ల ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, లేబర్ కోర్టుకు పంపిన ఉత్తర్వుల కాపీపై ఈ సమావేశంలో చర్చించారు. సమ్మె కొనసాగించాలా? ముగించాలా? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై నేతలు సమాలోచనలు చేశారు.

ఇదే అంశంపై మంగళవారం కూడా ఆర్టీసీ యూనియన్లు వేర్వేరుగా సమావేశం నిర్వహించుకొని కార్మికుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాయి. దీనికి కొనసాగింపుగా ఈరోజూ సమావేశమయ్యారు. అయితే సమ్మె కొనసాగించే అంశం పట్ల యూనియన్ల మధ్య చీలిక వచ్చినట్లు తెలుస్తుంది. మెజారిటీ కార్మికులు ముగింపు పలకాలనే అభిప్రాయంతో ఉన్నట్లు వారి మధ్య చర్చకు వచ్చింది. కానీ, 47 రోజులుగా సమ్మె జరిగినా ఆ సమ్మెకు ఎలాంటి సార్థకత లేకుండా అర్ధాంతరంగా ముగిస్తే లాభమేంటని మరికొంత మంది నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి సమ్మె ముగింపుకే మొగ్గు చూపారు.